Big relief for Jagan..If ​​those cases are dismissed, there will be no ED cases: Telangana High Court
mictv telugu

తెలంగాణ హైకోర్టులో జగన్‌కు భారీ ఊర‌ట‌..ఆ కేసులు ఉండవు

September 9, 2022

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టు ఓ కీలక విషయాన్ని వెలువరించింది. జగన్ మెహన్ రెడ్డిపై సీబీఐ కేసులు కొట్టివేత‌కు గురైతే, ఈడీ కేసులే ఉండ‌బోవ‌ని హైకోర్టు తెలియజేసింది. తొలుత సీబీఐ కేసుల్లో తీర్పు వెలువ‌రించిన త‌ర్వాతే, ఈడీ కేసుల్లో తీర్పు వెలువ‌రించాల‌ని పేర్కొంది. ఈ రెండు విషయాలను హైకోర్టు వెలువరించడంతో జగన్ మోహన్ రెడ్డికి భారీ ఊర‌ట ల‌భించినట్లైంది.

వివరాల్లోకి వెళ్తే.. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై న‌మోదైన సీబీఐ, ఈడీ కేసుల్లో తొలుత సీబీఐ కేసుల‌పైనే విచార‌ణ జ‌ర‌పాల‌ని, ఆ త‌ర్వాతే ఈడీ కేసుల‌పై విచార‌ణ సాగించాల‌ని గురువారం తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి, తాజాగా మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు..కీలక తీర్పును వెలువరించింది.

ఈ కేసుల్లో నిందితులుగా జగన్‌తోపాటు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, జ‌గ‌తి పబ్లికేష‌న్స్‌, భార‌తి సిమెంట్స్ పిటిష‌న్లు దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్ల‌పై విచార‌ణ చేప‌ట్టిన నాంప‌ల్లిలోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టు.. సీబీఐ కేసుల కంటే ముందుగా ఈడీ కేసుల‌పైనే విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తీర్పు చెప్పింది. ఈ తీర్పును విజ‌య‌సాయిరెడ్డి, జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్‌, భార‌తి సిమెంట్స్ తెలంగాణ హైకోర్టులో స‌వాల్ చేశాయి. ఈ క్రమంలో పిటిష‌న్ల‌పై ఇప్ప‌టికే విచార‌ణ ముగించిన హైకోర్టు గురువారం కీల‌క తీర్పు చెప్పింది.

”ఈ వ్య‌వ‌హారంలో ముందుగా సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ఈడీ కేసుల కంటే ముందుగా సీబీఐ కేసుల‌పైనే విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఒక‌వేళ రెండు ద‌ర్యాప్తు సంస్థ‌లు న‌మోదు చేసిన కేసుల‌పై ఒకేసారి విచార‌ణ జ‌రిగితే, తొలుత సీబీఐ కేసుల్లో తీర్పు వెలువ‌రించిన త‌ర్వాతే, ఈడీ కేసుల్లో తీర్పు వెలువ‌రించాల‌ని సూచించింది. సీబీఐ కేసులు కొట్టివేత‌కు గురైతే, ఈడీ కేసులే ఉండ‌బోవు” అని హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది.