Big relief for Saurabh Ganguly..Permission till 2025
mictv telugu

సౌరభ్ గంగూలీకి భారీ ఊరట..2025 వరకు అనుమతి

September 15, 2022

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. బీసీసీఐ బోర్డు పాలకుల విషయంలో..రాజ్యాంగంలో సవరణలకు సుప్రీంకోర్టు అనుమతించడంతో, పోటీ చేసేందుకు 2025 వరకు వారు అర్హత సాధించారు. తాజాగా కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను రద్దు చేయడంతోపాటు, తన రాజ్యాంగానికి అనేక కీలక సవరణలకు అనుమతివ్వాలని కోరుతూ, బీసీసీఐ దాఖలు వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం న్యాయస్థానం విచారణ జరిపింది.

విచారణలో భాగంగా..”రాష్ట్ర సంఘం, బీసీసీఐలో ఆరేళ్ల చొప్పున ఓ ఆఫీస్ బేరర్ నిరంతరాయంగా 12 ఏళ్లు పదవిలో కొనసాగవచ్చు. ఆ తర్వాతే కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధన వర్తిస్తుంది. అంటే ఓ ఆఫీస్ బేరర్ బీసీసీఐలోనైనా, రాష్ట్ర సంఘంలోనైనా ఆరేళ్లు (రెండు పర్యాయాలు) పని చేశాక తప్పనిసరి విరామం తీసుకోవాలి. రెండు (రాష్ట్ర సంఘం, బీసీసీఐ) పదవీ కాలాలను కలపరు. వేరు వేరుగా చూస్తారు. అవాంఛనీయ ఏకస్వామ్యాన్ని సృష్టించకూడదన్నదే తప్పనిసరి విరామం ఉద్దేశం” అని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం చెప్పింది.

ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. గంగూలీ, జైషాల పదవీకాలం పూర్తయినా, సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో సాంకేతికంగా పదవుల్లో కొనసాగుతూ వచ్చారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో వారికి మరో పర్యాయం బోర్డు ఎన్నికల్లో పోటీపడి 2025 వరకు అధ్యక్ష, కార్యదర్శులుగా ఉండే అవకాశం లభించింది.