మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు, కడప వైకాపా ఎంపీ అవినాశ్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారని వార్తలు వసున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఆయనకు కాస్త ఊరట కల్పించింది. సోమవారం వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు అవినాశ్ రెడ్డికి సంబంధించి జరిగిన విచారణ వివరాలను హార్డు డిస్క్‌లో తమకు అంచాలని స్పష్టం చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు సరిగ్గా వ్యవహరించడం లేదంటూ ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. సీబీఐ కార్యాలయంలో సీసీ కెమెరాలు లేవని, విచారణ పారదర్శకంగా జరగడం లేదని అవినాశ్ లాయర్ అన్నారు. రెండుసార్లు విచారణ జరిపిన సీబీఐ అవినాశ్‌తో సంతకాలు పెట్టించుకోలేదని, అతని వాంగ్మూలాన్ని సీబీఐ ఎస్పీ రాంసింగ్ 40 సార్లు మార్చాడని చేశారని ఆరోపించారు. ఈ కేసులో అసలు నేరస్థుడు వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డినే అన్నారు. అతణ్ని వదిలేసి, అవినాశ్‌ను అరెస్ట్ చేయబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వాదనలు విన్న కోర్టు అవినాశ్ రెడ్డిని సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదని సీబీఐని ఆదేశించింది. కాగా అవినాశ్ ఈ రోజు మూడోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఏపీలో ఈ కేసుపై విచారణ జరిపితే న్యాయం జరగదన్న వివేకా కూతురి వినతిపై కేసును సుప్రీం కోర్టు తెలంగాణకు బదిలీ చేయడం తెలిసిందే.