కొత్త ట్రెండ్.. అద్దెకు వినాయక విగ్రహాలు..
వినాయక చవితిలో గణేష్ విగ్రహాలకు పూజలు చేసి నిమజ్జనం చేయడం ఆనవాయితీ. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఎక్కువగా విగ్రహాలను ప్రతిష్టించి వాటిని నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణం, నీరు కలుషితం అవుతోందని పర్యావరణ వేత్తలు ఆవేదన చెందుతున్నారు అటువంటి వారి కోసం బెంగుళూరుకు చెందిన నందకిషోర్ అనే వ్యక్తి సరికొత్త ఆలోచన చేశాడు. పూజల కోసం ఎత్తైన విగ్రహాలను కిరాయికి ఇచ్చి తర్వాత వాటిని వెనక్కి తీసుకుంటున్నాడు.
దీనికి భక్తుల నుంచి కూడా స్పందన భారీగానే ఉంది. పెద్ద విగ్రహం పెట్టుకొని పూజ చేయాలని అనుకునే వారికి 18 అడుగుల ఎత్తు నుంచి అతి పెద్ద వినాయుకుడి విగ్రహాలను ఇక్కడ అద్దెకు ఇస్తున్నారు. వాటితో పాటు చిన్న వినాయక ప్రతిమను కూడా అందజేస్తున్నారు. నవరాత్రులు ముగిసిన తర్వాత పెద్ద విగ్రహాలను తిరిగి ఇచ్చేసి.. చిన్న ప్రతిమలను భక్తులు నిమజ్జనం చేసుకుంటున్నారు.
వీటిని ఫైబర్‌తో తయారు చేయడం వల్ల వాన, గాలి, ఎండకు చెక్కు చెదరకుండా ఉంటాయని అంటున్నాడు. దీంతో అద్దెకు తీసుకున్న వారు సులభంగా తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే పీఓపీ విగ్రహాలు తయారీని బీబీఎంపీ అధికారులు అడ్డుకుంటున్నారని అంటున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నప్పటికీ ఇది ఎంత వరకు నడుస్తుందోనని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.