big twist in the uppal twin murder case
mictv telugu

పూజలు ఫలించనందుకే జ్యోతిష్యుడి హత్య.. అడ్డొచ్చిన కొడుకును కూడా..

October 18, 2022

హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన జ్యోతిష్యుడు, అతడి కొడుకు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసమే బంధువులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తొలుుత భావించిన పోలీసులు.. పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే హత్యకేసుతో వారికి ఎలాంటి సంబంధం లేదని విచారణలో తెలియడంతో మరో కోణంలో దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీకెమెరాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్యకు ముందు దుండగులు జ్యోతిష్యుడైన నరసింహమూర్తి ఇంటి సమీపంలో ఉన్న హాస్టల్‌ వైపు నుంచి వచ్చినట్లు నిర్ధారించికున్నారు. హాస్టల్‌ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమాచారంతో నిందితులను గుర్తించారు. జ్యోతిష్యుడు చెప్పిన పూజలు ఫలించలేదని 23 ఏండ్ల ఓ యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువకుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

తెలిసిన వ్యక్తులకు జాతకాలు, పంచాంగం చెప్పే నరసింహమూర్తి ఇంటికి నిత్యం చాలా మంది జాతకం కోసం వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే సరూర్‌నగర్ మండలం మామిడిపల్లికి చెందిన 23 ఏళ్ల యువకుడు నరసింహ మూర్తిని కలిశాడు. ఉప్పల్‌లో తన అమ్మమ్మ వారింటి వద్దే ఉండే ఆ యువకుడు నరసింహామూర్తిని.. తన ఉద్యోగ యోగం గురించి, ఆర్థికంగా ఎదిగేందుకు జాతకం చెప్పించుకున్నాడు. ఇందుకు నరసింహామూర్తి యువకుడితో కొన్నాళ్లుగా పూజలు చేయిస్తూ వచ్చాడు. చేసిన పూజలతో ఫలితం లేకపోగా పెద్దఎత్తున డబ్బు ఖర్చు కావటంతో యువకుడు నరసింహమూర్తిపై కోపం పెంచుకున్నాడు. తన ముగ్గురు స్నేహితుల సహకారంతో నరసింహమూర్తిని చంపేయాలని పక్కా ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే తన అమ్మమ్మ ఇంటి వద్దే ఉన్న హాస్టల్‌లో దిగారు యువకులు. ఉదయం 5 నుంచి 6 గంటల సమయంలో ఎవరూ ఉండరని.. రెక్కీ ద్వారా నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి ప్రవేశించి కూర్చీలో కూర్చున్న నరసింహమూర్తిపై గొడ్డలితో దాడిచేశారు. తండ్రి అరుపులు విని, బయటికి వచ్చిన కుమారుడు శ్రీనివాస్‌పైనా దాడిచేసి దారుణంగా హతమార్చారు. హాస్టల్‌ నిర్వాహకులిచ్చిన సమాచారం లభ్యమైన పలు ఆధారాలతో నలుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.