ఇంటినుంచి గంగవ్వ ఔట్.. సొంతింటి కలను నిజం చేస్తానన్న నాగార్జున - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటినుంచి గంగవ్వ ఔట్.. సొంతింటి కలను నిజం చేస్తానన్న నాగార్జున

October 11, 2020

 

nvhmnh

బిగ్‌బాస్ సీజన్ 4కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వ నిన్న స్వచ్ఛందంగా ఇంట్లోంచి బయటకు వచ్చారు. ఇక్కడ తనకు గాలి సరిగ్గా ఆడటం లేదని.. ముద్ద మింగుడు పోవడం లేదని మునుపు కూడా చెప్పిన గంగవ్వ ఈసారి కూడా అవే కారణాలు చెప్పారు. తన ఆరోగ్యం క్షీణించడంతో బిగ్‌బాస్ ఆమెను శనివారం ఇంట్లోంచి బయటకు పంపారు. పచ్చని పల్లెటూరిలో స్వేచ్ఛగా పైరగాలిలో పొలం పనులు చేసుకుని జీవించిన గంగవ్వ ఈ ఇంట్లో అస్సలు పొసగలేకపోయారు. హోస్ట్ నాగార్జున కూడా ఆమెను తప్పని పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటకు పంపారు. అవ్వ ఇంట్లోంచి వెళ్లిపోతోందని ఇంటి సభ్యులు అందరూ కన్నీరు మున్నీరు అయ్యారు. స్టేజ్ మీదకు వచ్చాక గంగవ్వకు నాగార్జున సర్‌ప్రైజ్ చేశారు. ‘గంగవ్వా నువ్వు ఏదైతే అనుకుని బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చావో అది నెరవేరుతుంది. నీకు సొంతిల్లు కట్టిస్తాం. నువ్వేం బెంగ పెట్టుకోకు. మేమంతా చూసుకుంటాం’ అని నాగార్జున హామీ ఇచ్చారు. ఆమాట విని గంగవ్వ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

పోతూపోతూ ఇంటి వాళ్లందరి గురించి గంగవ్వ సరదాగా కామెంట్లు చేశారు. అఖిల్ ఇచ్చిన లవ్ సింబల్ గిఫ్టును చేతిలో పట్టుకుని మురిసిపోయారు. అఖిల్ గంగవ్వ వెళ్లిపోతుంటే కంటతడి పెట్టుకున్నాడు. ఆ ఇద్దరికీ ఇంట్లో బామ్మ మనవడి బాండ్ ఏర్పడింది. లాస్యను తన పెద్ద కుమార్తె అని చెప్పారు. తాను అన్నం తినకపోతే తెచ్చి తినిపించిందని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకున్నారు. గంగవ్వ ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశ పడుతున్నారు. ఆమె ఇంట్లో ఉంటేనే ఇంటికి కళ ఉంటుంది అని కామెంట్లు చేస్తున్నారు. ఆమె లేని బిగ్‌బాస్‌ను చూడలేమని అంటున్నారు. 

గంగవ్వ మళ్లీ రావొచ్చు..

బిగ్‌బాస్ సీజన్ 3లో మాదిరి రాహుల్ సిప్లిగంజ్‌ను కూడా ఎలిమినేట్ చేశారు. వారం తర్వాత మళ్లీ రాహుల్‌ను ఇంట్లోకి తెచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఆ వారం అతన్ని సీక్రెట్ గదిలో ఉంచారు. గంగవ్వ విషయంలోనూ అదే జరగవచ్చు అని అంటున్నారు. గంగవ్వకు ఇంటిమీద గాలి మళ్లడంతో ఆమెను ఓ రెండు వారాలు ఇంటికి పంపించి తర్వాత మళ్లీ ఇంట్లోకి తీసుకురావచ్చు అని తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు బాగా నచ్చజెప్పి పంపించవచ్చు అని అంటున్నారు. అయితే కరోనా సమయం కాబట్టి మళ్లీ క్వారంటైన్ లాంటివి ముగిస్తే ఆమె తిరిగి ఇంట్లోకి రావడానికి ఎటూ ఓ నెల రోజులు పట్టవచ్చు. కాగా, ఈవారం తొమ్మిది మంది ఎలిమినేషన్ లిస్టులో ఉండగా ఇంటి కెప్టెన్ సయ్యద్ సోహెల్ సేవ్ అయ్యాడు. ఈ వారమే కాకుండా వచ్చేవారం కూడా సోహెల్ సేవ్ అయ్యాడు. ఇక మిగిలినవారిలో జోర్దార్ సుజాత, అఖిల్, మహబూబ్, అమ్మ రాజశేఖర్, అరియానా, హారిక, అభిజిత్, లాస్య ఉన్నారు. చూడాలి మరి ఇవాళ ఎవరు ఇంటినుంచి బయటకు వెళ్తారు అనేది. జోర్దార్ సుజాత ఖచ్చితంగా ఎలిమినేట్ కావడం ఖాయమే అంటూ ఆమెకు సగానికి సగం మంది ఓట్లు వేస్తున్నారు. సుజాత ఎలిమినేట్ అవుతుందని 44 శాతం మంది ఓట్లు వేశారు. ఆమె తర్వాత అమ్మా రాజశేఖర్ డబల్ ఎలిమినేషన్ అవుతారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.