దోస్త్ మేరా దోస్త్.. రాహుల్, వరుణ్‌లకు బిగ్‌బాస్‌ ఫిటింగ్.. - MicTv.in - Telugu News
mictv telugu

దోస్త్ మేరా దోస్త్.. రాహుల్, వరుణ్‌లకు బిగ్‌బాస్‌ ఫిటింగ్..

September 25, 2019

బిగ్‌బాస్ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం అని బిగ్‌బాస్ ముందునుంచి చెబుతున్న మాటే. చాలా తెలివిగా టాస్కులు ఇస్తున్నాడు బిగ్‌బాస్. ప్రాణ స్నేహితులుగా వున్నవాళ్లను బద్ద శతృవులను చేయడం, శతృవులుగా వున్నవాళ్లను మిత్రులుగా చేయడంలో బిగ్‌బాస్ తనకుతానే సాటి. గేమ్, టాస్క్‌లు కాబట్టి హౌస్‌మేట్స్ ఆడాల్సిందే. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఇంట్లో భార్యాభర్తలైన వితికాషేరు, వరుణ్ సందేశ్ అడుగు పెట్టారు. అయితే ఈ టాస్కులతో అప్పుడప్పుడు వారు కూడా దెబ్బలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వీళ్ల విషయం ఇలా వుంటే శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్‌లు తొలుత నుంచి టామ్ అండ్ జెర్రీల్లానే వున్నారు. ఎలిమినేషన్ ప్రక్రియ వచ్చినప్పుడు ఏమాత్రం మొహమాటానికి వెళ్లకుండా ఒకర్నొకరు ఎలిమినేట్ చేసుకుంటారు. ఆమె అంటే తనకు పడదని.. అతనంటే తనకు పడదని ఇద్దరూ అనుకున్నారు. 

చెత్త యాంకరింగ్ చేస్తావని రాహుల్ తనను అవమానించాడని శ్రీముఖి అతనిపై కోపం పెంచుకుంది. తొలుతనుంచి ఇంట్లో పునర్నవి, వితిక, రాహుల్, వరుణ్ సందేశ్‌లు ఒకే మాట ఒకే పాట అన్నట్టుగా వున్నారు. అయితే బిగ్‌బాస్ వారి స్నేహానికి బీటలు వార్చాలని చూస్తున్నట్టే వుంది. ఇవాళ ఇచ్చిన టాస్కులో అదే జరిగింది. శివజ్యోతి అమ్మగా తన ముగ్గురు కొడుకులు, కోడళ్లు అయిన రవి, రాహుల్, వరుణ్, కోడళ్లు శ్రీముఖి, పున్ను, వితికలకు గోడ కట్టమంటుంది. ఒకరినుంచి ఒకరు ఇటుకలను లాక్కోవచ్చు. ఈ క్రమంలో వరుణ్ నుంచి రాహుల్ ఇటుకలు లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరిమధ్య తోపులాట జరిగింది.

BiggBoss.

మధ్యలో వితిక వచ్చి విడిపించే ప్రయత్నం చేస్తూ రాహుల్‌కు గిలిగింతలు పెట్టింది. వరుణ్ కింద పడ్డారు. దీంతో వరుణ్‌కు కోపం వచ్చి రాహుల్‌ను కసురుకున్నాడు. తనను ఎత్తి కింద పాడేశాడని వరుణ్ ఆరోపించాడు. తాను అలా చేయలేదని రాహుల్ వాదించాడు. వితిక నాకు గిలిగింతలు పెట్టలేదని, గిల్లిందని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య రభస పెరిగింది. సీరియస్‌గా అరుచుకున్నారు. ఇక్కడ కామెడీ ఏంటంటే.. వీళ్లూ వీళ్లూ గొడవ పడుతుంటే శ్రీముఖి, రవి జంట ఎంచక్కా తమ పని తాము కానిచ్చారు. లాక్కునేవారు లేరు కాబట్టి చకచకా ఇటుకలు తీసుకువెళ్తూ తమ గోడను నిర్మించుకోసాగారు. వరుణ్ మాత్రం తన చేతులకు గాయాలు అయ్యాయని చెప్పి అలిగి కూర్చున్నాడు. ఎడమొహం పెడమహంగా అయిపోయారు ఇంటి సభ్యులు. 

ఇలా జరిగితే శ్రీముఖికి మంచి ఛాన్స్ దొరికినట్టే అని పున్నూ రాహుల్‌తో అంటోంది. అయితే వీరి వాదోపవాదాలు శృతిమించేస్థాయిలో వెళ్లాయని రేపు చూపించబోయే ఎపిసోడ్‌తో ముగించాడు బిగ్‌బాస్. రేపు తప్పకుండా రాహుల్, వరుణ్ మధ్య పెద్ద గొడవే జరుగుతుందని బిగ్‌బాస్ అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటివరకు దోస్తు మేరా దోస్తు అన్న రేంజులో వున్న వరుణ్, రాహుల్‌లు బద్ద శతృవులు కానున్నారా? బిగ్‌బాస్‌కు కావాల్సిందే అదేనాయె. కలిసుండేవాళ్లను విడగొట్టడం.. విడిపోయినవాళ్లను కలపడం బిగ్‌బాస్ కర్తవ్యమాయె. ఏమైనా అంటే టాస్క్‌తో ముడి పెడతాడు బిగ్‌బాస్. 

తొలుతలో శ్రీముఖిని, శివజ్యోతిని వితిక అసహ్యించుకుంది. కానీ, ఇప్పుడు వారిద్దిరితో చక్కగా వుంటోంది. పున్నూ కూడా తొలుతలో ఇంట్లో పట్టనట్టు వుండేది. ఇప్పుడు తనలో కూడా మార్పు వచ్చింది. ఇదిలావుండగా రేపటి ఎపిసోడ్‌లో రాహుల్, వరుణ్‌ల గొడవ ఎక్కడికి పోతుందోనని బిగ్‌బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.