biggest bridges in India
mictv telugu

దూరాల తీరాల్ని కలిపే బ్రిడ్జ్….ఇంజనీరింగ్ అద్భుతం

January 6, 2023

biggest bridges in India

ప్రపంచ చరిత్రని మార్చిన ఇంజనీరింగ్ అద్భుతాల్లో వంతెనది కీలకపాత్ర. దూరాల తీరాల్ని కలిపే బ్రిడ్జి అంటే… రెండు ప్రపంచాల్ని ఏకం చేసే శక్తి. సమస్యల లోయల్ని దాటడానికి స్ఫూర్తి. ఇండియాలో అత్యంత పొడవైన భూపేన్ హజారికా వారధిని ఇంజనీరింగ్‌ అద్భుతంగా ప్రపంచం గుర్తిస్తోంది. అసలు భారతదేశంలో ఎన్ని బ్రిడ్జిలు ఉన్నాయి. వాటి సంగతేంటో తెలుసుకుందామా.

దేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా అసోంలోని భూపేన్ హజారికా సేతు నిలుస్తోంది. అసోం-అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల అనుసంధానం ఈ బ్రిడ్జి. అంతకంటే ముఖ్యంగా చైనాకి చెక్‌ పెట్టడానికి నిర్మించిన వ్యూహాత్మక వారధి ఇది. 60 టన్నుల బరువున్న ట్యాంకుల్ని కూడా తట్టుకునేలా దీన్ని నిర్మించారు.అసోంలోని ధోలా నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని సదియా వరకు నిర్మించిన వంతెనే భూపేన్ హజారికా సేతు. మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన బ్రిడ్జి ఇదే. అస్సాం- అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్ని అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9.15 కిలోమీటర్లు. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా తోడ్పడుతుందన్న భావనతో ఈ వంతెనను నిర్మించారు. దీన్నే ధోలా సదియా బ్రిడ్జి అని కూడా పిలుస్తున్నారు.

60 టన్నుల బరువు ఉండే భారీ యుద్ధ ట్యాంకులను సైతం తట్టుకునేలా పటిష్టంగా తీర్చిదిద్దారు ఈ బ్రిడ్జిని. భారత సైన్యంలోని అర్జున్‌, టీ-72 వంటి యుద్ధ ట్యాంకులను ఈ వంతెన ద్వారా సరిహద్దుకు సులువుగా తరలించవచ్చు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనంటూ చైనా పదే పదే కవ్వింపులకు పాల్పడుతోంది. ఈ కవ్వింపులకి చెక్ పెట్టాలంటే ఇక్క రవాణా స్పీడప్ చేయాలి. ఈ వ్యూహంతోనే భూపేన్ హజారికా వంతెన నిర్మించారు. కీలకమైన సమయాల్లో మన సైనికులను సత్వరమే తరలించడానికి ఈ వారధి ఎంతగానో ఉపయోగపడుతుంది.పూర్తిగా స్తంభాలపై నిర్మించిన భూపేన్‌ హజారికా సేతు అస్సాంలోని ఉత్తర ప్రాంతాన్ని అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాన్ని కలుపుతుంది. టిబెట్‌లో పుట్టి అరుణాచల్‌లో అడుగుపెట్టే లోహిత్‌ నది అసోంలో బ్రహ్మపుత్రలో కలుస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని బౌద్ధారామాలను, ప్రకృతి అందాలను, అంతర్జాతీయ సరిహద్దును వీక్షించాలనుకునే పర్యాటకులు ఈ వంతెన మీదుగా వెళ్లవచ్చు.

భూపేన్‌ హజారికా వంతెనని హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ నిర్మించింది. 2011 నవంబరులో నిర్మాణ పనులను ప్రారంభించి 2017లో పూర్తి చేసింది. నిర్మాణం కోసం దాదాపు వెయ్యి కోట్లు వెచ్చించారు. అస్సాంకి చెందిన కవి, రచయిత, సంగీతకారుడు, నేపథ్య గాయకుడు, నటుడు, నిర్మాత, భారత రత్న భూపేన్‌ హజారికా పేరును ఈ వంతెనకు పెట్టారు. స్వయంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ బ్రిడ్జి ప్రారంభమైంది.

హిందూ మైథాలిజీలోనే ఇంజనీరింగ్‌కి ఎనలేని ప్రాధాన్యత ఉంది. వానరసేనతో కలసి రాముడు నిర్మించిన వారధే ఇందుకు సాక్ష్యం. లంకలో ఉన్న సీత కోసం వెళ్లడానికి సముద్రంపైనే రామసేతుని నిర్మించారు. అయితే ఇది ఒట్టి పురాణకథ అని కొట్టిపడేస్తారు కొందరు. కాదు, ఇది నిజంగానే భారతీయులు నిర్మించిన అద్భుతం అన్న వాదనే ఎప్పుడూ బలంగా వినిపిస్తుంది.రామసేతు చరిత్ర గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మంచు యుగంలో భారత్, శ్రీలంకలను కలుపుతూ భూభాగం ఉండేదనేది ఓ వాదన. శ్రీలంక కూడా భారత ప్రధాన భూభాగంలో భాగమని, లక్షల ఏళ్ల క్రితం విడిపోయిందనేది మరో వాదన. హిందువులు మాత్రం… సీత కోసమే రాముడు సేతును నిర్మించాడని బలంగా నమ్ముతారు.

తమిళనాడులోని పంబన్ దీవి, శ్రీలంకలోని మన్నార్ దీవి మధ్య రామ సేతు ఉంది. దీన్నే ఆడమ్ బ్రిడ్జిగా కూడా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ సహజంగా ఏర్పడిన ఇసుక 4 వేల ఏళ్ల నాటిది. కాగా, ఏడు వేళ్ల ఏళ్ల క్రితం ఏర్పడిన రాళ్లను వేరే చోటు నుంచి ఇక్కడికి తరలించారని అమెరికాకి చెందిన ఓ సైన్స్ ఛానెల్ కూడా స్పష్టం చేసింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో 30 కిలోమీటర్లకి పైగా దూరాన్ని సున్నపు రాళ్లతో వంతెనలా అనుసంధానించినట్లు పలు కథనాలు వచ్చాయి.
ఏది ఏమైనా ఇండియన్ మైథాలిజీకి సంబంధించినంత వరకు రామసేతు ఒక అద్భుతం. నింగి నుంచి తీసిన అనేక దృశ్యాలు కూడా… రామసేతు నిజంగా కట్టారన్న భావనకి బలం చేకూర్చేలా ఉంటాయి.

వంతెన అంటేనే అద్భుతం. కానీ కొన్ని వారధులు మనిషి మేధస్సుకి తిరుగులేని ప్రతీకలు అనిపిస్తాయి. అసలా ఆలోచన ఎలా పుట్టిందా అని అబ్బురపరిచే వంతెనలు కొన్నయితే… నిర్మాణం ఎలా సాధ్యమైంది అనిపించే బ్రిడ్జిలు మరికొన్ని.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన మనదేశంలోనే ఉంది. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ రైల్వే బ్రిడ్జిని గత నెలలోనే ప్రారంభించారు. దీనిపై రైళ్ల రాకపోకలు డిసెంబర్‌లో ప్రారంభం అవుతాయి. చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తున దీన్ని కట్టారు. కేవలం ఒకే ఆర్చిపై ఉన్న రైల్వే వంతెన కూడా ప్రపంచంలో ఇదే.

జమ్ము కశ్మీర్‌‌లోని రియాసి జిల్లాలో బక్కల్, కౌరి ప్రాంతాల్ని చినాబ్ రైల్వే బ్రిడ్జి అనుసంధానిస్తుంది. దాదాపు 1.3 కిలోమీటర్ల పొడవుతో దీన్ని నిర్మించారు. కాంగ్రెస్‌ హయాంలోనే నిర్మాణం పూర్తి కావాల్సింది. కానీ వంతెన స్థిరత్వం, భద్రతపై అనుమానాలు తలెత్తడంతో 2008లో పనులకి బ్రేక్ పడింది. మళ్లీ 2010లో బ్రిడ్జి నిర్మాణం మొదలైంది. బీజేపీ సర్కార్ వచ్చాక పనులు వేగవంతం చేసి… కట్టడం పూర్తి చేశారు.

భారతదేశంలో కాలపరీక్షకు తట్టుకుని, చరిత్రకి సాక్ష్యంగా నిలిచిన వంతెనల్లో హౌరా ఒకటి. పశ్చిమ బెంగాల్ లో హుగ్లీ నదిపై ఉన్న కాంటిలివర్ వంతెన ఇది. పూర్తిగా ఉక్కుతో నిర్మించారు. 1936లో నిర్మాణం ప్రారంభమై 1942లో పూర్తయింది. తర్వాత దీనికి సమాంతరంగా మరో బ్రిడ్జి కూడా కట్టారు. హౌరా, కలకత్తా నగరాలను కలుపుతూ నిర్మించిన ఈ వంతెన కలకత్తా నగరానికి ఆయువు పట్టు. నట్లు, బోల్టులు లేని అత్యంత అరుదైన బ్రిడ్జిల్లో ఒకటి. మొత్తం రివిట్లతో నిర్మించిన మొదటి వంతెన ఇదే.ప్రతి రోజూ దాదాపు లక్షకు పైగా వాహనాలు దీన్ని దాటుతుండడం వల్ల ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన వంతెనల్లో ఇదొకటిగా పేరొందింది. రవీంద్ర సేతుగా పేరు మార్చినా ఇప్పటికీ అంతా హౌరా బ్రిడ్జే అంటున్నారు.

ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో సముద్రంపై కట్టిన అత్యంత అధునాతన బ్రిడ్జి… బాంద్రా-వర్లీ సీ లింక్. 2010లో దీనిపై రాకపోకలు మొదలయ్యాయి. రోజూ 37వేలకు పైగా వాహనాలు ఈ వంతెనపై ప్రయాణిస్తుంటాయి. ముంబై వచ్చే పర్యాటకుల్ని ఆకట్టుకునే విశేషాల్లో ఇదీ ఒకటిగా మారింది.

దేశంలో అత్యంత పొడవైన రైల్‌ రోడ్ వంతెన బోగీబీల్ బ్రిడ్జి 2018లో ప్రారంభమైంది. 4.9 కిలోమీటర్ల పొడవైన ఈ వారధికి 1997 శంకుస్థాపన చేశారు. పనులు నత్తనడకన సాగడంతో పూర్తవడానికి 21 సంవత్సరాలు పట్టింది. రెండు రైల్వే ట్రాక్‌లు ఉండడం దీని ప్రత్యేకత. అస్సాంలోని తిన్ సుకియా, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నార్ల్‌గన్‌ ప్రాంతాల్ని కలుపుతుంది ఈ వంతెన. ఈశాన భారతంలో రక్షణ పరంగానూ ఉపయోగపడే బ్రిడ్జి ఇది.

డార్జీలింగ్ ప్రకృతి అందాలకి ప్లస్ అవుతున్న వంతెన కరోనేషన్ బ్రిడ్జి. తీస్తా నదిపై కట్టిన ఈ సేతువు… డార్జీలింగ్‌ని కలింపాంగ్‌తో అనుసంధానిస్తుంది. పర్యాటకులు కూడా పింక్ రంగులో మెరిసిపోయే ఈ బ్రిడ్జిని చూసేందుకు ఎగబడుతుంటారు. 1937లో కింగ్‌ జార్జ్ – సిక్స్ పట్టాభిషేకం సందర్భంగా కరోనేషన్‌ బ్రిడ్జి పేరుతో దీనికి శంకుస్థాపన చేశారు. 1941లో నిర్మాణం పూర్తయి వాహనాల రాకపోకలు మొదలయ్యాయి.

1881లో గుజరాత్‌లోని నర్మదానదిపై బ్రిటీష్‌ వాళ్లు కట్టిన వంతెన గోల్డెన్ బ్రిడ్జి. ముంబైకి వెళ్లే వ్యాపారవేత్తలకి ఇబ్బంది లేకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో దీన్ని నిర్మించారు. దీనినే నర్మదా బ్రిడ్జి అని కూడా అంటారు.

ఇండియాలో మూడో పొడవైన వంతెన మహాత్మాగాంధీ సేతు. గంగానదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి బీహార్ రాజధాని పట్నాని, హాజీపూర్‌ని కలుపుతుంది. మొత్తం పొడవు 5.7 కిలోమీటర్లు. 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, మహాత్మాగాంధీ సేతుని జాతికి అంకితం చేశారు. బీహార్‌లోనే గంగానదిపై నిర్మించిన మరో వంతెన విక్రమశిల సేతు. పొడవైన వంతెనల్లో దీనిది ఆరోస్థానం. 2001లో విక్రమశిల సేతుపై రాకపోకలు ప్రారంభం అయ్యాయి. మొత్తం పొడవు 4.7 కిలోమీటర్లు. భాగల్‌పూర్‌లోని బరారీ ఘాట్‌, నౌగాచియా మధ్య ఈ బ్రిడ్జ్ నిర్మించారు.

గంగానదిపై బీహార్‌లోనే నిర్మించిన మరో వంతెన… దిఘా సోన్‌పూర్ బ్రిడ్జి. దీన్నే జేపీ సేతు అని కూడా అంటారు. పట్నా లోని దిఘా ఘాట్‌ నుంచి సోన్‌పూర్‌లని పెలేజా ఘాట్ వరకూ ఈ రైల్వే వంతెన నిర్మించారు. మొత్తం పొడవు 4.5 కిలోమీటర్లు.బీహార్‌లోనే గంగానదిపై ఆరా-చప్రా మధ్య కట్టిన ఇంజనీరింగ్‌ అద్భుతం వీర్‌ కున్వర్ సింగ్ సేతు. దీన్నే ఆరా-చప్రా బ్రిడ్జి అని కూడా అంటారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మల్టీస్పాన్‌ ఎక్స్‌ట్రాడోస్‌డ్‌ వంతెనగా దీనికి పేరుంది. మామూలు వంతెనల నిర్మాణానికి తోడు కేబుల్స్‌ జోడించడమే దీని ప్రత్యేకత. ఈ వంతెన పొడవు 4.3 కిలోమీటర్లు. పొడవైన వంతెనల్లో దీని స్థానం తొమ్మిది. ఇక బీహార్‌లోనే కచ్చీదర్గా – బిదూపూర్‌ మధ్య 9.7 కిలోమటర్ల పొడవుతో మరో వంతెన నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో అత్యంత పొడవైన వంతెన అవుతుంది.

ఉత్తరాదిన ప్రవహించే జీవనదులపై నిర్మించిన వంతెనలే కాదు… దక్షిణాదినా ఎన్నో బ్రిడ్జిలు దూరాల్ని దగ్గర చేస్తున్నాయి. వీటిలో కొన్ని టూరిజం పరంగానూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..?

దక్షిణ భారతదేశంలో వంతెన అన్న మాట వినగానే గుర్తొచ్చేది పంబన్ రైల్వే బ్రిడ్జి. ఇండియాలో సముద్రంపై కట్టిన అద్భుతం పంబన్ బ్రిడ్జి. పంబన్ దీవిని, భారత భూబాగాన్ని కలుపుతూ నిర్మించిన కట్టడం ఇది. బ్రిటీష్‌ వారి హయాంలో 1914లో ఈ వంతెన నిర్మించారు. 2.3 కిలోమీటర్ల పొడవుండే ఈ వంతెన నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత నిజంగా ఇంజనీరింగ్‌ మార్వెల్ అనుకోవాలి. దీని క్రింద నౌకలు వెళ్లే సమయంలో బ్రిడ్జి రెండుగా విడిపోతుంది. నౌకలు వెళ్లిపోయాక తిరిగి యధాస్థితికి చేరుకుంటుంది. వందేళ్లు దాటినా ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా సేవలందిస్తోంది పంబన్ బ్రిడ్జి. 2010లో బాంద్రా-వర్లి సీ లింక్‌ ప్రారంభం అయ్యేంత వరకు… భారతదేశంలో సముద్రంపై కట్టిన వంతెనల్లో పంబన్ బ్రిడ్జే పొడవైనది. 1964లో వణికించిన రామేశ్వరం తుఫాన్ కూడా ఈ వంతెనని ఏమీ చేయలేకపోయింది. కేవలం కొన్ని రిపేర్లు మాత్రమే చేశారు అప్పుడు. తర్వాత 2009లో వంతెనపై నుంచి గూడ్స్‌ రైళ్లు కూడా తిప్పడానికి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రముఖ ఇంజనీర్ శ్రీధరన్‌ సారధ్యంలో బ్రిడ్జిని బలోపేతం చేశారు. ఈ వంతెనకి సమాంతరంగా రోడ్‌ బ్రిడ్జి కట్టారు. ఇప్పటికీ ఈ ప్రాంతానికి వెళ్లే టూరిస్టుల బకెట్‌ లిస్టులో పంబన్‌ బ్రిడ్జి తప్పకుండా ఉంటుంది.

కేరళలోని కొచ్చిలో కట్టిన వెంబనాడ్ రైల్ బ్రిడ్జి… దేశంలోనే రెండో పొడవైన రైలు వంతెన. 4.6 కిలోమీటర్ల పొడవున ఈ వారధి కట్టారు. కొచ్చిలోని ఎడప్పల్లి, వల్లార్‌పాదమ్‌ లని ఈ బ్రిడ్జి కలుపుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణ వ్యయం 350 కోట్ల రూపాయలు. అత్యాధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థతో అద్భుత ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రిడ్జిగా దీనిని చెప్తారు. కేవలం ఒకటిన్నరేళ్లలో దీన్ని పూర్తి చేశారు. మొత్తం 231 పిల్లర్లపై ఈ వంతెన నిర్మాణం జరిగింది. 2011లో దీనిని జాతికి అంకితం చేశారు.

భారత దేశంలోని జీవ నదుల్లో గోదావరి ఒకటి. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద పుట్టి సుమారు 1465 కిలోమీటర్లు ప్రవహించే ఈ జీవనది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరిగా కనువిందు చేస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలను వేరుచేసే ఈ నదిపై రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య భారీ వంతెనలు దర్శనమిస్తాయి. ఈ వంతెనలు ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలకే కాకుండా పర్యాటకంగానూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ వంతెనల్లో ముఖ్యమైనది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రోడ్ కమ్ రైల్వే వంతెనల్లో ఇది మూడోది. 1970లో నిర్మాణం ప్రారంభం కాగా… 1974, ఆగష్టు 16న నిర్మాణం పూర్తి చేసుకుని రాకపోకలు మొదలయ్యాయి. ఈ వారధి పొడవు 4.1 కిలోమీటర్లు. బోగీబీల్ బ్రిడ్జి ప్రారంభం కాకముందు దేశంలో ఇదే అత్యంత పొడవైన రైల్ రోడ్ బ్రిడ్జి. గోదావరి నదిపై ఉన్న పాత వంతెనను హేవలాక్ వంతెన అని పిలుస్తారు. హౌరా-మద్రాస్ మధ్య నడిచే రైళ్ళు ఈ వంతెనపై ప్రయనించేవి. 1897 నవంబర్ 11న ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. అప్పటి మద్రాస్ గవర్నర్ అయిన సర్ ఆర్డర్ ఎలిబక్ హేవలాక్ పేరునే ఈ వంతెనకు పెట్టారు. ప్రస్తుతం వాడుకలో లేని ఈ వంతెనను ఇంజనీరింగ్ పర్యాటక ప్రదేశంగా మార్చారు.

హేవలాక్ బ్రిడ్జి స్థానాన్ని భర్తీచేయడం కోసం గోదావరి నదిపై ఆర్చ్ వంతెన కట్టారు. 1991లో ప్రాంరంభమైన దీని నిర్మాణం 1997 వరకు కొనసాగింది. 2003లో ఆర్చ్ వంతెనపై రైళ్ళ రాకపోకలు మొదలయ్యాయి. ఈ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న సమయంలో రైలు ప్రయాణికులు ప్రత్యేక అనుభూతికి లోనవుతారు. అంత సుందరంగా ఈ నిర్మాణం ఉంటుంది. దీన్ని కొవ్వూరు-రాజమండ్రి వంతెన అని కూడా పిలుస్తారు.

అఖండ గోదావరిపై ఉన్న రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై రద్దీని తగ్గించే ఉద్దేశంతో నిర్మించిన మరో వంతెన ఫోర్త్ బ్రిడ్జి. నాలుగు వరుసలు కలిగిన ఈ వారధి వల్ల చెన్నై-కోల్‌కతా మధ్య సుమారు 50 కిలోమీటర్ల దూరం తగ్గింది.

కృష్ణా నదిపై కట్టిన పలు వంతెనలు కూడా రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. పరవళ్లు తొక్కే కృష్ణమ్మపై 1957లో కట్టిన ప్రకాశం బ్యారేజీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. కృష్ణా-గుంటూరు జిల్లాలకి నిన్న మొన్నటి వరకూ ఇదే ప్రధాన వారధి. అయితే పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా కనకదుర్గ వారధి నిర్మించాయి ప్రభుత్వాలు. ఈ వంతెనని 2.2 కిలోమీటర్ల పొడవున నిర్మించారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డున దుర్గం చెరువుపై కట్టిన కేబుల్ బ్రిడ్జి… భాగ్యనగరానికి అదనపు ఆకర్షణ అయింది. దాదాపు 180 కోట్ల ఖర్చుతో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వంతెన ఇది.