ఆసియాలోనే పెద్ద స్టెంట్ల ఫ్యాక్టరీ తెలంగాణలో - MicTv.in - Telugu News
mictv telugu

ఆసియాలోనే పెద్ద స్టెంట్ల ఫ్యాక్టరీ తెలంగాణలో

October 2, 2018

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. గుండె సంబంధ స్టెంట్ల తయారీ సంస్థ ఎస్‌ఎంటీ ( సహజానంద మెడికల్ టెక్నాలజీస్) రూ. 250 కోట్లతో స్టెంట్ల తయారీ ప్లాంట్ పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా మినిమల్లీ ఇన్వేసిస్ లైఫ్ సేవింగ్ మెడికల్ డివైజస్ తయారీకి సంబంధించిన ప్లాంటును ఏర్పాటు చేయబోతోంది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ మంత్రి కేటీఆర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భార్గవ్ కటడియా బృందం సమావేశమయ్యారు. ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.

rr

ప్లాంటు ఏర్పాటు ద్వారా 2200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. సుల్తాన్పూర్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ డివైసెస్ పార్క్లో ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 1.25 మిలియన్ స్టంట్లు, రెండు మిలియన్ల బెలూన్ కాతీటర్స్ ను ఈ కంపెనీ తయారు చేయనుంది. ఇప్పటి వరకు సూరత్‌లోనే కార్యకలాపాలు నిర్వహించిన ఈ సంస్థ ఇప్పుడు హైదరాబాద్‌లో సంస్థను ప్రారంభించనుంది.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్నేహపూర్వక విధానాలతోపాటు టీఎస్ ఐపాస్, మౌలిక వసతులే ఇక్కడ పెట్టుబడి పెట్టేలా చేశాయని కంపెనీ మెనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. మెడికల్ డివైసెస్ తయారీ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు తమ వంతు సహకారం అందజేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ స్వాగతించారు. హైదరాబాద్ ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రంగంలో టాప్‌లో ఉందని, ఇప్పుడు అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే వైద్య పరికరాల తయారీ ప్లాంట్  రావడం ద్వారా తెలంగాణ రానున్న రోజుల్లో రంగంలో పెట్టుబడులకు ఆకర్షనీయ  కేంద్రంగా మారుతుందన్నారు.