Bihar: Acquitted in 26-yr-old case, elderly man dies of heart attack
mictv telugu

26 ఏళ్లుగా న్యాయపోరాటం.. కోర్టు నిర్ధోషి అని చెప్పడంతో..

October 21, 2022

26 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న ఓ వ్యక్తికి కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో పట్టరాని ఆనందంతో సదరు వ్యక్తి కోర్టులోనే మృతి చెందాడు. బిహార్‌లోని బాంకాలో ఈ విషాదకర ఘటన జరిగింది. తాను నిర్దోషినంటూ పోరాటం చేస్తున్న వ్యక్తి.. తనకు అనుకూలంగా తీర్పు రాగానే ఆనందం తట్టుకోలేక మరణించాడు. న్యాయమూర్తి తీర్పును వెలువరించగానే.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

అప్రమత్తమై వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బెల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝుంకా గ్రామానికి చెందిన నాగో సింగ్ సహా మరో ఐదుగురిపై 1996లో పంట తగలపెట్టారని కేసు నమోదైంది. వీరందరూ కొంతకాలం విచారణ ఖైదీలుగా జైలులో ఉన్నారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చారు. తాము నిర్దోషులమంటూ గత 26 ఏళ్లుగా పోరాడుతున్నారు. తాజాగా బుధవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును విన్న నాగో సింగ్(76).. ఆనందాన్ని తట్టుకోలేక అక్కడే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన అధికారులు.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు నిర్ధరించారు. మృతుడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు.