మమ్మల్ని గెలిపిస్తే అందరికీ కరోనా టీకా ఫ్రీ..  - MicTv.in - Telugu News
mictv telugu

మమ్మల్ని గెలిపిస్తే అందరికీ కరోనా టీకా ఫ్రీ.. 

October 22, 2020

 Free

ఎన్నికల వేళ నేతలు చేసే వాగ్దానాలు ఊహాతీతంగా ఉండే విషయం తెలిసిందే. వారు వాగ్దానం చేసింది జరుగుతుందా అనే అనుమానం ఓటర్లలో కలగకమానదు. గెలవడమే పరమావధిగా నేతలు వాగ్ధానం చేయడం.. వాళ్ల మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేయడం పరిపాటే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే కరోనా టీకా ఉచితంగా అందిస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వాగ్దానం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను పాట్నాలో ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. బీహార్ రాష్ట్ర ప్రజలు రాజకీయంగా చాలా సున్నితంగా ఉంటారని వ్యాఖ్యానించారు. బీహారీలకు రాజకీయ పరిజ్ఞానం కూడా ఎక్కువనే అని అన్నారు. పార్టీలు చేసే వాగ్ధానాలను వారు అర్ధం చేసుకుంటారని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం హయాంలో బీహార్‌లో జేడీపీకి ప్రజల మద్దత్తు బాగా పెరిగిందని తెలిపారు. 

3 శాతం నుంచి 11.3 శాతానికి గత 15 ఏళ్ళ ఎన్డీయే ప్రభుత్వంలో పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ‘ప్రజలకు సుపరిపాలన అందించడం వల్లే బీజేపీకి ఇది సాధ్యం అయింది.  కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభయ్యాక బీహార్‌లో ప్రతి పౌరుడికి ఉచితంగా ఆ టీకా ఇవ్వనున్నాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము చేసిన తొలి వాగ్దానం ఇదే. ఎన్డీయేకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. మరో ఐదేళ్ల పాటు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆయన పాలనలో బీహార్ ఉత్తమ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది’ అని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.