Bihar Assembly Speaker Vijay Kumar Sinha resigns ahead of floor test
mictv telugu

నాటకీయ పరిణామాల మధ్య.. బలపరీక్ష ముందే బిహార్ స్పీకర్ రాజీనామా

August 24, 2022

సీఎం నితీశ్ కుమార్ సర్కారు బలపరీక్షకు ముందు బిహార్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నితీశ్ ప్రభుత్వానికి ఆర్జేడీ మద్దతు ఇస్తుండగా.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతల నివాసాలపై సీబీఐ బుధవారం దాడులు చేసింది. మరో వైపు బలపరీక్షకు ముందే.. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాఘట్బందన్‌ ప్రభుత్వం అసెంబ్లీ స్పీకర్‌ విజయ్ కుమార్ సిన్హాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తొలుత రాజీనామా చేసేది లేదని స్పష్టం చేసిన విజయ్ కుమార్ సిన్హా.. బుధవారం ఎట్టకేలకు స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. తనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం స్పష్టంగా లేదన్నారు. అవిశ్వాసం తీర్మానం కోసం 9 మంది సభ్యుల నుంచి తనకు అందిన లేఖల్లో 8 నిబంధనల ప్రకారం లేవన్నారు.

ప్రభుత్వం మధ్యంతరంగా మారినప్పుడు స్పీకర్ కూడా బాధ్యతల నుంచి తప్పుకుంటారు. కానీ జేడీయూ ఆధ్వర్యంలో మహాఘట్‌బంధన్ ప్రభుత్వం బిహార్లో అధికారంలోకి వచ్చి రెండు వారాలైనా సిన్హా రాజీనామా చేయడానికి అంగీకరించలేదు. దీంతో బీజేపీ నుంచి వచ్చిన సిన్హాపై జేడీయూ, ఆర్జేడీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఆగస్టు 10న అసెంబ్లీ సెక్రటేరియట్‌కు తీర్మానాన్ని అందించగా.. ఆర్జేడీ, జేడీయూ, సీపీఐ (ఎంఎల్) పార్టీకు చెందిన 55 మంది ఎమ్మెల్యేలు తీర్మానంపై సంతకం చేశారు.