Bihar CM Nitish Kumar calls key meeting of JD(U) MPs, MLAs amid talk of ‘split’ with BJP
mictv telugu

ఎన్డీఏ నుంచి జేడీయూ గుడ్‌బై.. సోనియాకు నితీశ్ ఫోన్

August 8, 2022

బిహార్‌ అధికార కూటమి జేడీయూ, బీజేపీలో సంక్షోభం ముదురుతోంది. సీఎం నీతీశ్ కుమార్ పార్టీ ఏ క్షణంలోనైనా బీజేపీతో తెగదెంపులు చేసుకునేలా పరిణామాలు మారుతున్నాయి. రేపు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్న నితీశ్.. అనంతరం కీలక ప్రకటన చేయబోతున్నారు. అనంతరం ఆయన సోనియా గాంధీతో సమావేశమై యూపీఏ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కొంతకాలంగా దూరంగా ఉంటున్న నితీశ్ కుమార్.. నిన్న జరిగిన నీతి ఆయోగ్ భేటీకి కూడా వెళ్లలేదు. ఇప్పటికే తాజాగా నాలుగుసార్లు కేంద్రం నిర్వహించిన సమావేశాలకు నితీశ్ డుమ్మా కొట్టారు. ఇదిలా ఉండగా.. తాజాగా బీహార్ ను ఉగ్రవాద అడ్డాగా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం చేసిన ప్రకటన నితీశ్‌కు మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన ఇక ఎన్డీయేను వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

రేపు పార్టీ భేటీలో బీజేపీ గురించి తన అభిప్రాయాల్ని ఎంపీలు, ఎమ్మెల్యేలకు వివరించనున్న నితీశ్.. ఎన్డీయేకు గుడ్ బై చెప్పాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. దీంతో ఈ భేటీ కీలకంగా మారింది. జేడీయూ పార్టీ మాజీ అధ్యక్షుడు ఆర్‌సీపీ సింగ్ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సింగ్‌ను జేడీయూ ఆదేశించిన నేపథ్యంలో ఆయన శనివారం పార్టీని వీడారు. కొద్ది నెలలుగా బిహార్ ముఖ్యమంత్రికి, సింగ్‌కు పొసగడం లేదని, అలాగే ఆయనకు బీజేపీ అనుబంధం పెరిగిందని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రేపు జరుగబోయే భేటీలో ఆర్‌సీపీ సింగ్ ను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా జేడీయూను చీల్చాలని బీజేపీ చూస్తుందనే ఆరోపణను నితీశ్ ప్రధానంగా తెరపైకి తెచ్చే అవకాశముంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, విపక్ష తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్‌లతో కలిసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి నీతీశ్‌ ఫోన్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ వీటిని ఖండించింది. మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 11లోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన ఆర్‌జేడీతో చేతులు కలిపితే బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్లే అవుతుంది.