ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి బిహార్‌లో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీలో చేరారు. 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకుంది. కాగా ఆ పార్టీ తరఫున ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు.
మజ్లిస్ బిహార్ విభాగం అధ్యక్షుడు అఖ్తారుల్ ఇమాన్ తప్ప మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ పార్టీలో చేరారు. ఆర్జేడీ నేత, బిహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌ను కలిసిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. షానవాజ్, ఇజార్ అస్ఫీ, అంజార్ నైమీ, సయ్యద్ రుక్నుద్దీన్ ఆర్జేడీ కండువా కప్పుకున్నవారిలో ఉన్నారు. వీరందరినీ తన కారులో ఎక్కించుకొని స్వయంగా అసెంబ్లీకి తీసుకెళ్లారు తేజస్వీ యాదవ్.
మజ్లీస్‌ను వదిలి ఆర్జేడీ చేరిన వారిలో మహ్మద్ ఇజార్ అస్ఫీ (కొచ్చాడమామ్), షానవాజ్ ఆలం (జోకిహాట్), సయ్యద్ రుక్నుద్దీన్ (బైసీ), అజర్ నయీమి (బహదూర్‌గంజ్) ఉన్నారు. తాజా చేరికలతో ఆర్జేడీ ఎమ్మెల్యేల సంఖ్య 80కి పెరిగింది. తద్వారా అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల్లో ఆర్జేడీ 75 స్థానాలు గెలుచుకుంది. ఉపఎన్నికల్లో మరో స్థానం తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు చేరిన ఆర్జేడీ ఎమ్మెల్యేలతో ఈ సంఖ్య 80కి చేరుకుంది.