దేశంలో దశాబ్దాలపాటు పెండింగులో ఉన్న బీసీ జనాభా లెక్కల దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. బీసీ కులగణనకు కేంద్రం వెనకాడుతున్న నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాలవారీగా జనాభా సేకరణను శనివారం నుంచి ప్రారంభించింది. దేశంలో కులాలవారీగా జనాభా లెక్కలు తీయడం ఇదే తొలిసారి. దీనిపై బీసీ కులాలు హర్షం వ్యక్త చేస్తుంటో, కొన్ని పార్టీలు, సామాజిక వర్గాలు లోలోపల ఆందోళనపడుతున్నాయి. సమాజంలో మెజారిటీ వర్గమైన బీసీ జనాభా లెక్కతేలితే చట్టసభల్లోనూ, ఇతర పదవుల్లోనూ వాటా కావాలనే డిమాండ్ వస్తుందని, తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆధిపత్య వర్గాలు భావిస్తున్నాయి. బ్రిటిష్ హయాంలో 1931లో కులాలతోపాటు అన్ని అంశాల ఆధారంగా జానాభా లెక్కలు తీశారు. తర్వాత కులగణనకు స్వస్తి పలికారు.
కులాల వారీగా జనాభా సేకరణ చేపట్టడానికి బిహార్ ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది. తొలిదశ ఈ నెల 21న ముగుస్తుంది. రెండో విడత సేకరణ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని వర్గాలకు న్యాయం చేయడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అయితే బీజేపీ దీనికి అడ్డుపడుతోందని డిప్యూటీ తేజస్వి యాదవ్ మండిపడ్డారు. శాస్త్రీయ జనాభా లెక్కల కోసం కులాల వారీ జనాభా లెక్కల సేకరణ అవసరమని, దీని ఆధారంగా అందరికీ మేలు చేసే సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టొచ్చని అన్నారు.