సుశాంత్ కేసులో ట్విస్ట్.. ఐపీఎస్‌కు బలవంతపు క్వారంటైన్ - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్ కేసులో ట్విస్ట్.. ఐపీఎస్‌కు బలవంతపు క్వారంటైన్

August 3, 2020

Bihar IPS Forcibly Quarantined in Sushanth Case

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణ రోజుకో మరో మలుపు తిరుగుతోంది. ఇందులో దోషులెవరూ, కారణాలేంటో తెలియదు కానీ, ఈ వ్యవహారం పోలీసుల మధ్య కోల్డ్ వార్‌కు దారి తీసింది. బిహార్, మహారాష్ట్ర పోలీసులు ఒకరికి మించి మరొకరు వ్యవహరిస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు బిహార్ నుంచి వచ్చిన సీనియర్ పోలీసు అధికారి వినయ్ తివారీని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఈ చర్యను బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే తీవ్రంగా తప్పుబట్టారు. విచారణ అధికారిని నిబంధనలు పేరుతో క్వారంటైన్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి కల్పించాల్సిందిపోయి చేతికి క్వారంటైన్ స్టాంపు వేస్తారా అంటూ ప్రశ్నించారు.  

సుశాంత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు ఆమె కుటుంబసభ్యుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ  సుశాంత్ తండ్రి కేకే సింగ్ బిహార్‌లో కేసు నమోదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఐపీస్ అధికారి వినయ్ తివారీ వివరాల కోసం ముంబై వెళ్లారు. ఆయన అక్కడికి చేరుకున్న వెంటనే ముంబై మున్సిపల్ అధికారులు నిబంధనల పేరుతో క్వారంటైన్ చేశారు. ఓ గెస్ట్ హౌజ్‌కు తరలించి 14 రోజులు క్వారంటైన్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వివరాల కోసం వచ్చిన తనకు ఇలా జరగడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బిహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య సుశాంత్ కేసు వివాదాన్ని రేపింది. కాగా  ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు ఇప్పటివరకు రియా చక్రవర్తితోపాటు దాదాపు 40 మంది వాంగ్మూలాలను రికార్డు చేసిన సంగతి తెలిసిందే.