బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. సొంత పార్టీలోని అసమ్మతి భగ్గున మండి వేరు కుంపటికి దారితీసింది. జేడీయూ కీలక నేత ఉపేంద్ర కుష్వాహా పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశానని, నితీశ్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నానని మండిపడ్డారు. అంతేకాకుండా రాష్ట్రీయ లోక్ జనతా దళ్ పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్టు సోమవారం ప్రకటించారు. కుష్వాహా ప్రస్తుతం జేడీయూ పార్లమెంటరీ బోర్డు చైర్ పర్సన్‌తో పాటు పలు కీలకపదవుల్లో ఉన్నారు. ఆయన నిష్క్రమణతో నితీశ్‌కు మున్ముందు మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.
ఎందుకు?
‘‘నితీశ్ కారణంగా పార్టీ బలహీనపడింది. 2005లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల ఆశీర్వాదాలు ఉండేవి, కానీ తర్వాత ఆయన మారిపోయారు. తన కోటరీ చెప్పినట్లు వింటూ పార్టీని దెబ్బతీశారు. బీసీ, దళిత నాయకులను అణగదొక్కారు. తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవాళ్లను కాకుండా ఆర్జేడీ నాయకులను తన వారసులుగా ప్రకటిస్తున్నారు’’ అని కుష్వాహా మండిపడ్డారు. ఆర్జేడీ నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్ ను డిప్యూటీ సీఎంను చేయడాన్ని, 2024 ఎన్నికల్లో మహాఘట్ బంధన్ తేజస్వీ సారథ్యంలోనే తలపడుతుందని చెప్పడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. 63 ఏళ్ల కుహ్వాగా ఎంపీగా, ఎమ్మెల్సీసీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనవైపు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తనకు ప్రాధాన్యం ఉండదని, ఎన్నో కొన్న సీట్లు సొంతంగా సాధించి కింగ్ మేకర్ కావాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది.