మందు కోసం దారి మధ్యలో రైలు దిగిపోయిన డ్రైవర్... - MicTv.in - Telugu News
mictv telugu

మందు కోసం దారి మధ్యలో రైలు దిగిపోయిన డ్రైవర్…

May 3, 2022

ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఓ లోకో పైలట్.. రైలును మార్గమధ్యలోనే వదిలేసి మద్యం సేవించేందుకు వెళ్లాడు. రైలు గంటపాటు నిలిచిపోవడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. చివరకు రైలును నడపాల్సిన లోకో పైలట్ కనిపించకపోవడంతో జీఆర్పీ పోలీసులు అతని కోసం వెతికే ప్రయత్నం చేశారు. సదరు పైలట్.. ట్రైన్ ఆపిన స్టేషన్ దగ్గరలో ఉన్న మద్యం దుకాణానికి వెళ్లి అక్కడే తప్పతాగి పడిపోవడం చూసి షాకయ్యారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం సమస్తిపూర్-సహర్సా రైలు (05278) సమస్తిపూర్ జంక్షన్‌లో 139 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహర్సాకి బయల్దేరింది.

అయితే హసన్‌పూర్ స్టేషన్‌లో రెండు నిమిషాలు ఆపాల్సిన ట్రైన్‌ను.. లోకో పైలట్ కరమ్‌వీర్ ప్రసాద్ యాదవ్ మ‌ద్యం కొనడానికి వెళ్లి, సుమారు గంట పాటు ప్ర‌యాణికులకు చుక్క‌లు చూపించాడు. ఈ విష‌యం స్టేషన్ మాస్టర్ మనోజ్ కుమార్ చౌదరి దృష్టికి తీసుకెళ్ల‌డంతో.. అదే రైల్లో ప్రయాణిస్తున్న మరో అసిస్టెంట్ లోకో పైలట్ రిషి రాజ్ కుమార్‌ను పిలిచి రైలును అక్కడ నుంచి కదిలించారు. తర్వాత ప్రభుత్వ రైల్వే పోలీసులు రంగంలోకి దిగి కరమ్‌వీర్‌ను పట్టుకున్నారు. కానీ అప్పటికే చాలా తాగి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై సమస్తిపూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అలోక్ అగర్వాల్ విచారణకు ఆదేశించినట్టు చెప్పారు.