Bihar Man marries wife of another man who eloped with his wife in Khagaria
mictv telugu

ప్రియుడితో లేచిపోయిన భార్య.. ‘ఆమె’ను పెళ్లి చేసుకున్న భర్త

February 28, 2023

భార్య ప్రియడితో లేచిపోయిందన్న కఠిన వాస్తవాన్ని అంగీకరించని కొందరు భర్తలు.. వారి మీద కోపంతో దారుణాలకు తెగబడేవారి గురించి విన్నాం. కానీ బిహార్‌కు చెందిన ఓ భర్త మాత్రం తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే పగతో.. అతడి భార్యను అదే స్టైల్ లో పెళ్లి చేసుకున్నాడు ఓ వ్యక్తి. వినటానికి కొంచెం వింతగా ఉన్నా.. ఈ రివేంజ్ మ్యారేజ్ బిహార్‌లోని ఖగాడియా జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని హర్దియా గ్రామానికి చెందిన నీరజ్… పస్రాహా గ్రామానికి చెందిన రూబీ దేవిని 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు. అయితే పెళ్లికి ముందు రూబీ దేవి తన గ్రామానికి చెందిన ముకేశ్ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి.. ఆ ప్రేమ అనైతిక సంబంధానికి దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. పెద్దలు కుదిర్చారని నీరజ్ను పెళ్లి చేసుకున్నాక కూడా ముకేశ్తో సంబంధాన్ని అలాగే కొనసాగించింది. ఇకపోతే, అప్పటికే ముకేశ్.. అమ్నీ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కూడా రూబీనే కావడం విశేషం. వీరికి ఇద్దరు పిల్లలు.

అయితే గతేడాది ఫిబ్రవరిలో నీరజ్ భార్య రూబీ దేవి, ముకేశ్‌లు ఊరు విడిచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నీరజ్.. పోలీస్ స్టేషన్‌లో ముకేశ్‌పై కిడ్నాప్ కేసు పెట్టాడు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లినా ముకేశ్ తప్పించుకొని తిరుగుతున్నాడని బాధితుడు నీరజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన భార్య రూబీ దేవి, ముకేశ్‌లపై ప్రతీకారం తీర్చుకునేందుకు నీరజ్ ఏకంగా ముకేశ్ భార్యతో వివాహేతర సంబంధాన్ని ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఆమెను ఈ నెల 18న స్థానిక ఆలయంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. ఇకపోతే నీరజ్ ప్రముఖ టాటా కంపెనీలో పనిచేస్తుండగా.. ముకేశ్ దినసరి కూలీ. ఆ ఆరుగురు పిల్లలకు తల్లిదండ్రులు ఎవరో తేల్చుకోలేక అయోమయంలో ఉన్నారు.