ఇటీవలి కాలంలో భార్యాబాధితుల సంఘాలు.. నిరాహార దీక్షలు, నిరసనలు అంటూ తమ ఉనికిని చాటుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. భార్యలు వేధిస్తున్నారని, గృహ హింస చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ తమపై అన్యాయంగా కేసులు పెడుతున్నారంటూ చాలామంది భర్తలు అనేక రకాలుగా ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే వీరందరికి భిన్నంగా .. తాజాగా ఓ భార్యా బాధితుడు చేసిన పని మాత్రం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.
హర్యాణాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. ఓ వ్యక్తి కిడ్నీ అమ్ముకుంటానని, లేదంటే ఆత్మహత్య శరణ్యం అంటూ ఓ బ్యానర్ తో తిరుగుతున్నాడు. ఈ బ్యానర్ పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి పేరు సంజీవ్. అతను బీహార్ రాజధాని పాట్నాకు చెందిన వ్యక్తి. సంజీవ్ కు ఆరేళ్ల కిందట పెళ్లయింది. అప్పటినుంచి భార్య, బావమరిది, అత్తమామల నుంచి అతడికి వేధింపులు మొదలయ్యాయి. అవి రోజురోజుకు పెరిగిపోయాయి. వీటిని భరించలేక విడాకులు కోరితే.. తాను విడాకులు ఇవ్వాలంటే పది లక్షలు ఇవ్వాలని భార్య డిమాండ్ చేస్తుందని సదరు బాదితుడైన సంజీవ్ చెబుతున్నాడు.
దీంతో తనకు ఈ బాధల నుంచి విముక్తి కలిగించాల్సిందిగా పోలీసులను అధికారులను అనేకసార్లు సంప్రదించాడు. అయినా కూడా ఫలితం లేకపోవడంతో ఇలా బ్యానరు తయారు చేసుకుని తిరుగుతున్నానని తెలిపాడు. మార్చి 21లోగా తన కిడ్నీ అమ్మ గలిగితే ఆ డబ్బులు తన భార్యకు ఇస్తానని.. అలా జరగని పక్షంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. 21 వరకు తన కిడ్నీ అమ్ముడుపోకపోతే జరిగే ఆత్మహుతి కార్యక్రమం తన స్వస్థలమైన పాట్నాలో ఉంటుందని తెలిపాడు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లకు ఆహ్వానం పలుకుతూ వారి పేర్లను కూడా బ్యానర్లో ఒకవైపు ముద్రించాడు. మరోవైపు తన ఈ స్థితికి కారణమైన భార్య, బావమరిది, ఇతర బంధువుల ఫోటోలను ప్రింట్ చేయించాడు. భార్య తన దగ్గరకు రావాలని తాను కోరుకుంటున్నా సరే.. రావడానికి ఆమె సిద్ధంగా లేదని సంజీవ్ తెలిపాడు. దీంతో రోడ్లపై వెళ్లే వారు తమ వాహనాలు ఆపి మరీ.. సంజీవ్ బాధను తెలుసుకుంటున్నారు.