వారి జనాభాను కూడా లెక్కించాల్సిందే - మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

వారి జనాభాను కూడా లెక్కించాల్సిందే – మంత్రి

June 3, 2022

జనాభా లెక్కలు తీసుకునేటప్పుడు కులాల వారీగా కూడా జనగణన చేయాలని బీహార్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అలా చేయడం వల్ల ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో స్పష్టంగా తెలుస్తుందనే కోణం ఉంది. అయితే తాజాగా బీహార్ కేబినెట్ మంత్రి నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కులాల వారీ గణనతో పాటు అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలను కూడా లెక్కించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘ముస్లిం వర్గానికి చెందిన కొందరు ముగ్గురు చొప్పున భార్యలను కలిగి ఉన్నారు. ఒక్కో కుటుంబంలో 15 నుంచి 20 వరకు పిల్లలున్నారు. ఇలాంటి వారంతా జనాభా లెక్కల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అలాంటి వారికి అవకాశమివ్వకుండా వారిని కూడా లెక్కలోని తీసుకోవాలి. తద్వారా రాష్ట్రంలో మైనారిటీ జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇంతకు ముందు బీహార్‌లో అక్రమంగా వలస వచ్చిన వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని బబ్లూ ఆరోపణలు చేశారు. అయితే పై డిమాండ్ అలా ఉండగా, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాత్రం రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలు జనాభాను లెక్కించకూడదని పేర్కొనడం గమనార్హం.