Bihar Minister Kartik Kumar, Accused In Kidnapping Case, Resigns Hours After Being Handed New Portfolio
mictv telugu

న్యాయశాఖ మంత్రిపై కిడ్నాప్ కేసు.. శాఖ మార్పు.. ఆ వెంటనే రాజీనామా

September 1, 2022

సాక్షాత్తూ న్యాయశాఖ మంత్రిపై కిడ్నాప్ కేసు నమోదు కావడంతో ఆ మంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి డిమోట్‌ చేశారు. తనకు గతంలో కంటే తక్కువ స్థాయి పదవి కేటాయించడంతో అలిగిన ఆ మంత్రి గంటల వ్యవధిలో రాజీనామా చేశారు. క్షణాల్లోనే ఆమోదించిన సీఎం.. దానిని గవర్నర్‌ ఆమోదానికి పంపారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ఆర్జేడీకి చెందిన బీహార్ న్యాయశాఖ మంత్రి కార్తిక్ కుమార్ పై కిడ్నాప్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. దీంతో బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్తీక్ కుమార్ కు న్యాయశాఖ నుంచి మార్చి చక్కెర పరిశ్రమల మంత్రిత్వశాఖను కేటాయించారు.

అయితే, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేయడం, రాజీనామా లేఖను నితీశ్ కుమార్ గవర్నర్‌కు పంపడం చకచకా జరిగిపోయాయి. కుమార్‌కు కేబినెట్‌లో చోటు కల్పించడంపై పునరాలోచించాలంటూ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీపీఐఎంఎల్, కాంగ్రెస్ పార్టీలు నితీశ్‌ను కోరిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కుమార్ రాజీనామా చేసిన వెంటనే బీహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ స్పందించారు. ఫస్ట్ వికెట్ పడిందని, మరిన్ని వికెట్లు పడడం ఖాయమని ట్వీట్ చేశారు.