Bihar Minister Surendra Yadav made sensational criticism of Agniveer scheme
mictv telugu

అది హిజ్రాల సైన్యం.. అగ్నివీరులను ఎవరూ పెళ్లి చేసుకోరు : మంత్రి

February 24, 2023

కేంద్రప్రభుత్వం సైన్యంలో తెచ్చిన నూతన విధానం అగ్నివీర్‌పై బీహార్ మంత్రి, ఆర్జేడీ నేత సురేంద్రయాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ ఐడియా ఇచ్చిన వాళ్లను ఉరి తీయాలని, అంతకంటే ఇతర చిన్న శిక్షలేవీ సరిపోవన్నారు. మన ఆర్మీ పటిష్టంగానే ఉంది కదా.. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అని ప్రశ్నించారు. అంతేకాక, అగ్నివీర్ స్కీం ద్వారా నియమితులయ్యే సైనికులను హిజ్రాలతో పోల్చారు. ‘ఎనిమిదిన్నరేళ్ల తర్వాత సైనికులు పదవీవిరమణ చేయనున్నారు. ఇంత తక్కువ సమయంలో వారి శిక్షణ కూడా పూర్తికాదు. సరిగ్గా 8.5 ఏళ్ల తర్వాత దేశంలో హిజ్రాల సైన్యం తయారవుతుంది.

దీంతోపాటు మరో కొత్త సమస్య వచ్చి పడుతుంది. 25, 25 ఏళ్ల వయసులో అగ్నివీరులుగా రిటైర్ అయిన వారికి పెళ్లి సంబంధాలు వస్తాయి. అప్పుడు ఏం చెప్తారు? నేను రిటైర్డ్ సైనికుడిని అని చెప్తారా? అలా చెప్తే వారిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?’ అని నిలదీశారు. కాగా, 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసున్న వారు అగ్నివీర్ స్కీంలో చేరడానికి అర్హులు. త్రివిధ దళాల్లో నాలుగేళ్లు పని చేసిన తర్వాత 75 శాతం మందిని తొలగిస్తారు. 25 శాతం మందికి మరో 15 ఏళ్ల పాటు దళాల్లో కొనసాగిస్తారని తెలిసిందే.