Bihar police arrested a parrot in illegal liquor case
mictv telugu

అక్రమ మద్యం కేసులో చిలుకను విచారించిన పోలీసులు.. వీడియో వైరల్

January 26, 2023

Bihar police arrested a parrot in illegal liquor case

బీహార్ పోలీసులు విచిత్రంగా ప్రవర్తించారు. అక్రమ మద్యం కేసులో ఓ రామచిలుకను స్టేషనుకు తీసుకెళ్లి విచారించారు. స్థానికులు వీడియో తీసి నెట్టింట పెట్టడంతో అది విపరీతంగా వైరల్ అవుతోంది. మూగ జీవాలను విచారించడమేంటీ? మతిగానీ పోయిందా? అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. వినోదభరితంగా అనిపించే ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌ రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉంది. దీంతో అక్కడి మందుబాబులకు కొందరు మద్యాన్ని అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో గయాలోని గురువా స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.

దీంతో అప్రమత్తమైన ఇన్స్‌పెక్టర్ కన్హయ్య కుమార్ ఆ గ్రామంలోకి ప్రవేశించి అమృత్ మల్లా ఇంటిపై దాడి చేశారు. అయితే అంతకు కొద్ది సేపటి ముందే దాడిని పసిగట్టిన అమృత్ మాట్లాడే పెంపుడు చిలుక.. యజమానికి పోలీసుల రాకను తెలియజేసి వారు పారిపోయేందుకు సహకరించింది. దాడి సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కన్హయ్య కుమార్ చిలుకను బంధించాడు. అమృత్ తప్పించుకోవడానికి చిలుకనే కారణమని పంజరంలో బంధించి స్టేషనుకు తరలించాడు. అక్కడ ‘ఒరే మిట్టూ (చిలుక పేరు) మీ యజమాని ఎక్కడున్నాడు. ఎక్కడికి పారిపోయాడు’ అని ప్రశ్నిస్తే చిలుక మాత్రం ‘కటోరే కటోరే కటోరే’ అంటూ ఒకే మాట మాట్లాడుతోంది. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు. యజమాని పట్ల చూపిస్తున్న స్వామి భక్తిని చూసి ఆశ్చర్యపోతున్నారు. అటు నెటిజన్లు నేరస్థులను పట్టుకోవడం చేతకాక చిన్న ప్రాణిని బంధించి విచారిస్తారా? అంటూ హేళన చేస్తున్నారు.