బాధ్యత గల వృత్తిలో ఉన్న ఆ కానిస్టేబుల్ భావోద్వేగాలకు బానిసై ఉన్మాదిగా ప్రవర్తించాడు. భార్య కాపురానికి రావట్లేదన్న కోపంతో ఆమె తండ్రి, సోదరుడిపై విచక్షణా రహితంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. బీహార్‌లోని ముంగేర్ జిల్లా కాసిం బజార్‌కు చెందిన సోనూ కుమార్‌కు, అంచల్‌తో గత ఏడాది జులై 16న వివాహం జరిగింది. సోనూ బీహార్ పోలీస్ శాఖలో పనిచేస్తున్నాడు. పెళ్లైన కొత్తలో వీరి కాపురం బాగానే ఉన్నా… ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. పెద్దలు నచ్చ చెప్పినా వారు రాజీ పడలేదు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం అంచల్ తన పుట్టింటికి వెళ్లిపోయిది.
నెలలు గడుస్తున్నా అంచల్ తిరిగిరాకపోవడంతో.. ఆమెను కాపురానికి పంపించాలని సోనూ అత్తామామలకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత నేరుగా వారి ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. భర్త వద్దకు వెళ్లే ప్రసక్తే లేదని అంచల్ తేల్చిచెప్పింది. దీంతో సోనూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ మరుసటి రోజు(బుధవారం) ఉదయం రివాల్వర్ పట్టుకుని అత్తింటికి వెళ్లాడు. మళ్లీ వారితో గొడవకు దిగాడు. ఆ తర్వాత తుపాకీతో మామ గిర్ధర్, బావమరిది కృష్ణకుమార్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో గిర్ధర్ అక్కడికక్కడే మరణించగా… కృష్ణకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్లో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. కాల్పులు జరిపిన తర్వాత సోనూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.