Bihar political crisis Nitish kumar power politics
mictv telugu

నితీశ్‌కు బీజేపీతో ఎక్కడ చెడింది? కారణాలివే!!

August 9, 2022

Bihar political crisis Nitish kumar power politics

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. దీనికి తాజా తాజా ఉదాహరణ జేడీయూ నేత నితీశ్ కుమార్. మంగళవారం సీఎం పోస్టుకు రాజీనామా చేసిన ఆయన బుధవారం ఆర్జేడీ మద్దతుతో మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాద్ ఉపముఖ్యమంత్రి కాబోతున్నారు. రాజకీయాల్లో ఇదేమంత ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. నితీశ్ కమార్ తీరు తొలి నుంచీ అంతేనంటున్నారు విమర్శకులు. అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్‌లతో ఏది ఎప్పుడు అవసరమైతే దాని వెంట వెళ్లడం, అవసరం తీరాక తెప్ప తగలెయ్యడం ఆయనకు అలవాటే. బీజేపీ మతతత్వ పార్టీ అని నిందించే ఆయన ఎన్నికల్లో ఆ పార్టీ బలంగా ఉన్నట్లు కనిపిస్తే పొత్తు పెట్టుకుంటారు. పాత తిట్లన్నీ మర్చిపోతారు. కాంగ్రెస్ లౌకిక పార్టీగా కనిపిస్తే దాని వెంట వెళ్తారు. తాజా పరిణామం దానికి కొనసాగింపే.

Bihar political crisis Nitish kumar power politics

బిహార్‌లో నిన్నటివరకు సాగిన జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో నిజానికి ఆదినుంచీ లుకలుకలు ఉన్నాయి. తను సెక్యులర్ అని చెప్పుకునే నితీశ్ సందర్భం వచ్చిప్పుడల్లా కేంద్రంలోని మోదీ విధానాలను విమర్శిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ప్రత్యక్షంగా కొన్నిసార్లు పరోక్షంగా సన్నాయి నొక్కులు నొక్కారు కానీ తీవ్రనిర్ణయం తీసుకోలేకపోయారు. తాజాగా కేంద్రం ఆర్మీ కోసం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై బిహార్‌లో తీవ్ర హింస జరగడంతో ఆయన తెగతెంపుల నిర్ణయానికి రాక తప్పలేదు. ఇది ‘తక్షణ కారణం’ ఏం కాదు. అంతకు ముందు నుంచే చాలా గడబిడ సాగుతోంది.

బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న నితీశ్ డిమాండును మోదీ పెడచెవిన పెట్టారు. పౌరసత్వ సవరణ(సీఏఏ), కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపతి రద్దు, అయోధ్య రామమందిరం, ట్రిపుల్ తలాక్, బిహార్‌లోని అనుమానిత ఉగ్రవాద సంస్థలపై కేంద్రం అణచివేత వంటి అనేక అంశాలపై జేడీయూ, బీజేపీల మధ్య ఏకాభిప్రాయం పెంపొందలేదు. తన సెక్యులరిస్టు ఇమేజీకి ఇలాంటి బీజేపీ నిర్ణయాలతో పెద్ద దెబ్బ తలుగుతుందని నితీశ్ భావిస్తున్నారు.
2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 43 సీట్లు గెలుచుకున్న జేడీయూ 74 సీట్లు సాధించిన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ తదితర పక్షాలతో అంతకుముందు చెలిమి చేసిన నితీశ్ ఎన్డీఏ మద్దతుతో సీఎం అయ్యారు.

యా అంశాలపై బీజేపీతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ‘గత్యంతరం’ లేని పరిస్థితిలో కాషాయానికి విడాకులు ఇచ్చేశారు. ఇప్పుడు ఆర్జేడీ ప్రాబల్యమున్న మహాఘట్ బంధన్‌తో ఆయన బంధం బలంగా ఉంటుందన్న గ్యారంటీ లేదు. గత పరిణామాలు పునరావృతమై నితీశ్ ఎప్పటికెయ్యది అవసరమో గమనించి దాని వెంట వెళ్లిపోతుంటారు.