నితీశ్ గుస్సా.. ఆ పుస్తకాన్ని బయటికి తీసిన సంఘ్! - MicTv.in - Telugu News
mictv telugu

నితీశ్ గుస్సా.. ఆ పుస్తకాన్ని బయటికి తీసిన సంఘ్!

July 18, 2019

Bihar politics nitish kumar verses rss sangh parivar ........

టార్గెట్ నితీశ్ కుమార్ దిశ‌గా బీజేపీ పావుల‌ను వేగంగా క‌దుపుతోంది. మొన్న‌టి పార్లమెంట్ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసిన బీజేపీ, జేడీఎస్‌ల పొత్తు కేంద్రం రెండోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాడ్డాక కీచులాటతో బెడిసి కొట్టింది. పొత్తు కింద తమకు 4  మంత్రి ప‌ద‌వులు కావాల‌ని నితీశ్ డిమాండ్ చేయడా మోదీ తూచ్ అన్నారు. రెండు ప‌ద‌వులు మాత్ర‌మే ఇచ్చే అవకాశం ఉంద‌ని చెప్ప‌డంతో అలిగిన నితీశ్, ఏ ప‌ద‌వీ తీసుకోకుండా అలకపూనారు. 

 అప్ప‌టి నుంచీ బీజేపీ, జేడీఎస్ మ‌ధ్య దూరం మ‌రోసారి పెరిగింది. ఆ త‌ర్వాత పలుమార్లు బీజేపీ, సంఘ్ ప‌రివార్లపై నితీశ్ కుమార్ ఆరోప‌ణ‌లు చేశారు. ఇక భారీ వ‌ర‌ద‌ల‌కు 65 మంది ప్రాణాలు కోల్ప‌వ‌డానికి నితీశ్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే కార‌ణమంటూ బీజేపీ మండిపడింది. ఈ మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న స‌మ‌యంలో నితీశ్ తీసుకున్న నిర్ణ‌యం రెండు పార్టీల మ‌ధ్య బంధాన్ని పూర్తిగా తెంచేసే ప‌రిస్థితి తెచ్చింది. 

రాష్ట్రంలోని ఆర్ఎస్ఎస్ నేత‌ల వివ‌రాలు, సంఘ్ ప‌రివార్ అనుబంధ సంస్థ‌ల వివ‌రాలు, వారి కార్య‌క‌లాపాలపై పూర్తిస్తాయిలో నివేదిక కావాలంటూ నితీశ్ ఈ ఏడాది మే 28వ తేదీన ఇంటెలిజెన్స్ అధికారుల‌ను ఆదేశించారు. మొద‌టి నుంచీ సంఘ్ ప‌రివార్‌పై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి  గ‌తంలో ఎన్డీయే కూట‌మిలో కొన‌సాగిన‌ప్పుడు కూడా ఆర్ఎస్ఎస్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇక 2016లో అయితే సంఘ్ ముక్త్ భార‌త్ రావాలని డిమాండ్ చేశారు. ఆ త‌ర్వాత ఎన్డీయేలో చేరిన ఆయ‌న, కొన్నాళ్ల పాటు నోరు కుట్టేసుకున్నారు. 

తాజాగా దాడికి దిగడానికి బలమైన కార‌ణం ఉంద‌ని చెబుతున్నారు జేడీఎస్ నేత‌లు. సంఘ్ ప‌రివార్ విభాగ‌మైన‌ శిక్షా సంస్కృతి ఉద్ధాన్ న్యాస్, జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్ రీస‌ర్చ్ మాజీ డైరెక్ట‌ర్ స‌దాచారి సింగ్ తోమ‌ర్ రాసిన ‘భ్ర‌ష్టాచార్ కా బోల్బ‌లా’ పుస్త‌కం తాజాగా వెలుగులోకి తెచ్చింది. న్యాస్ అధ్య‌క్షుడు దీనాథ్ బాత్రా, యోగా గురు బాబా రాందేవ్ ప్రోత్సాహంతో తోమ‌ర్ ఈ పుస్త‌కం రాశారు. 1998-99లో అప్ప‌టి ప్ర‌ధాని అటల్ బిహారి వాజ్‌పేయి మంత్రివ‌ర్గంలో వ్య‌వ‌సాయ మంత్రిగా ప‌ని చేశారు నితీశ్. 1995లో అప్ప‌టి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రెండు వ్య‌వ‌సాయ రంగ ప్రాజెక్టుల‌ను త‌న హాయంలో అమ‌ల్లోకి తెచ్చారు. ప్ర‌పంచ బ్యాంకు నిధులు సమకూరుస్తున్న ఈ ప్రాజెక్టులు లక్ష్యం.. దేశ వ్యాప్తంగా వ్య‌వ‌సాయాన్ని ఆధునీక‌రించ‌డం, కంప్యూటీక‌ర‌ణ చేయ‌డం. ఇందుకోసం 437 సెంట‌ర్ల‌ను కూడా అధికారులు గుర్తించారు. వీటిలో 2000 కోట్ల రూపాయ‌ల అవినీతి జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇదంతా నితీశ్  క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగిన‌ట్లు తోమ‌ర్ త‌న పుస్త‌కంలో ఆరోపించారు. ఈ అంశాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌ల్చుకునే ప్ర‌య‌త్నంలో భాగంగానే ఇప్పుడు ఆ పుస్త‌కాన్ని ఒక్క‌సారిగా వెలుగులోకి తెచ్చింది సంఘ్ ప‌రివార్. దీంతో ఆ సంస్థపై మ‌రోసారి అస‌హనం వ్య‌క్తం చేసిన నితీశ్ పరివార్ పని పట్టడంలో భాగంగా డేటా సేకరిస్తున్నారని భావిస్తున్నారు. ఓవైపు భారీ వ‌ర‌ద‌ల‌తో 65 మంది ప్రాణాలు కోల్పోయి, ల‌క్ష‌లాది మంది సొంత గ్రామాల‌కు దూర‌మై ఇబ్బందులు ప‌డుతున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌ల మీద జ‌నం అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న త‌రుణంలో త‌న మీద తాజా ఆరోప‌ణ రావ‌డాన్ని నితీశ్ జీర్ణించుకోలేక పోతున్నారు.