Bihar woman sunita wants doctor's twokidneys
mictv telugu

’ఆ డాక్టర్ గాడి రెండు కిడ్నీలు నాకు పెట్టండి..’

November 16, 2022

డబ్బుపై కక్కుర్తితో పేషంట్ల కిడ్నీలు మాయం చేస్తున్న డాక్టర్ల దుర్మర్గాలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి. మత్తు ఇంజక్షన్ ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీలు పీకేసి లక్షలు కొల్లగొట్టే ఈ నీచానికి హద్దే లేదు. కాకపోతే ఎంత నీచులైనా మరీ రెండు కిడ్నీలూ తీసుకోరు. ఆ లోటు భర్తీ చేయాలని ఓ దుర్మార్గుడు వైద్యం కోసం తనను నమ్మి వచ్చిన ఓ మహిళ నుంచి రెండు కిడ్నీలూ తీసి అమ్ముకున్నాడు. ప్రస్తుతం డయాలసిస్‌పై రోజులు లెక్కబెట్టుకుంటున్న ఆమె ఒక పక్క కన్నీళ్లతో తన బాధ వివరిస్తూ మరో పక్క ఆ డాక్టర్ చావును కళ్లారా చూడాలనుకుంటోంది. ‘‘వాడి రెండు కిడ్నీలనూ నాకు తీసి పెట్టండి, ఇంకేం వద్దు’ అంటోంది.

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సునీత(38) ఈ ఏడాది సెప్టెంబర్‌లో గర్భాశయ సమస్యతో ఆర్కే సింగ్ అనే డాక్టర్ నడుపుతున్న ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. సింగ్ డబ్బు పిశాచి. సునీత అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఆపరేషన్ పేరుతో ఆమె రెండు కిడ్నీలను కాజేశాడు. సర్జరీ తర్వాత ఆరోగ్యం విషయమించడంతో ఆమె ప్రభుత్వాస్పత్రికి చేరింది. అక్కడి వైద్యులు పరీక్షించి కిడ్నీలు గల్లంతయ్యాయని చెప్పారు. ఆర్కే సింగ్ అప్పటికే ఊరి నుంచి పారిపోయాడు. సునీత ప్రస్తుతం సర్కారీ దవాఖానాలో డయాలసిస్ చేయించుకుంటోంది. పేదరాలైన ఆమెకు ముగ్గురు పిల్లలు. ‘‘ఆ డాక్టర్ గాడిని వెంటనే అరెస్ట్ చేసి, వాడి కిడ్నీలు నాకు పెట్టండి. అలా చేస్తేనే నాకు న్యాయం జరిగినట్లు. వాడికి ఆ శిక్ష వేస్తే కిడ్నీలు లాక్కునే మిగతా డాక్టర్లు భయపడతారు’’ అంటోంది సునీత