Bihar: Young man stabbed for watching Nupur Sharma's video in Sitamarhi
mictv telugu

నూపుర్ శర్మ వీడియో చూశాడని.. యువకుడిని పొడిచేశారు

July 19, 2022

నూపుర్ శ‌ర్మ కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో పోస్టులు చేశార‌ని రాజ‌స్థాన్‌లోని ఉద‌య‌పూర్‌లో టైల‌ర్, మహారాష్ట్రలోని అమరావతి వెట‌ర్న‌రీ ఫార్మ‌సిస్టు హ‌త్య మ‌ర‌వ‌క‌ముందే బీహార్‌లో ఇలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి వెలుగులోకి వ‌చ్చింది. సీతామర్హిలో ఓ యువ‌కుడు నూపుర్ శ‌ర్మ వివాదాస్పద వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో చూశాడ‌ని మ‌రో వ్య‌క్తి అత‌డిని దారుణంగా క‌త్తితో 6 సార్లు పొడిచాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది.
అయితే నాలుగు రోజుల క్రితం జరిగిన ఆ హత్యకు వ్యక్తిగత శత్రుత్వమే కారణమని, యువ‌కుడు చూసింది నూపుర్ శ‌ర్మకు సంబంధించిన వీడియో కాద‌ని పోలీసులు కొట్టిపారేశారు. ప్ర‌త్య‌క్ష సాక్షులు, బాధితుడి తండ్రి మ‌నోజ్ ఝా తెలిపిన వివ‌రాల ప్రకారం.. నాన్‌పూర్‌లోని బహెరా గ్రామానికి చెందిన అంకిత్ ఝా (23) అనే యువకుడు పాన్ తినేందుకు దగ్గర్లోని పాన్ షాపుకు వెళ్లాడు. ఈ సమయంలో అంకిత్ ఝా త‌న‌ మొబైల్‌లో నుపుర్ శర్మ వీడియోను చూస్తున్నాడు. అక్కడకు అదే గ్రామానికి చెందిన మహమ్మద్ బిలాల్ అనే వ్య‌క్తి త‌న ముగ్గురు స్నేహితుల‌తో క‌లిసి.. నూపుర్ శర్మ వీడియో చూస్తున్నట్లు చెప్పబడుతున్న అంకిత్ ముఖంపై సిగరెట్ పొగను ఊదడం ప్రారంభించాడు.

అనంత‌రం దుర్భాషలాడుతూ.. అంకిత్ న‌డ‌ముపై ఆరు సార్లు క‌త్తితో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైర‌ల్ గా మారింది. దాడి స‌మ‌యంలో బాధితుడు ప‌రిగెత్త‌డం, అనంత‌రం ర‌క్తస్రావం జ‌రుగుతుండ‌గా కింద ప‌డిపోవ‌డం ఆ వీడియోలో క‌నిపిస్తోంది. స్థానికులు వెంట‌నే అప్ర‌మ‌త్తం అయి క్ష‌త‌గాత్రుడిని హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. ఇప్పుడు అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.