సైకోలు అంతే హత్యలను కూడా చాలా టేకిటీజీగా తీసుకుంటారు. ‘పక్కనే ఉన్నా నన్ను పట్టుకోలేదు.. పోలీసులను చూసి నవ్వుకున్నాను’ అని ఆ సైకో అన్నాడు. అతను ఎవరో కాదు, మహబూబాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన 9 ఏళ్ల దీక్షిత్ కిడ్నాపర్, మర్డర్ కేసులో నిందితుడు మంద సాగర్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కిడ్నాప్ కథ ముగింపు విషాదం అయిన విషయం తెలిసిందే. లోకం తెలియని చిన్నారిని సాగర్ అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడు. కొడుకు హత్యతో దీక్షిత్ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. అయితే దీక్షిత్ది మొదటి నుంచి నేర వైఖరేనని సమాచారం. అతడికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. దీక్షిత్‌ను కిడ్నాప్ చేసి హత్యచేసిన సాగర్.. బాలుడి తల్లికి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అతడు డిమాండ్ చేసినట్టుగానే బాలుడి తండ్రి డబ్బుతో చౌరస్తా వద్దకు వచ్చాడు. ఆ సమయంలో తన షాపు వద్దకు వచ్చిన సాగర్.. ఏమీ తెలియనివాడిలా రంజిత్ రెడ్డి వద్దకు వెళ్లి ఆరా తీసే ప్రయత్నం చేశాడు.
అప్పటికే విపరీతమైన ఆందోళనలో ఉన్న రంజిత్ రెడ్డి అక్కడినుంచి వెళ్లిపోవాలని సాగర్‌తో చెప్పాడు. అప్పటికి సాగరే కిడ్నాపర్ అని వారికి తెలియదు. ఆ సమయంలో అక్కడ కొందరు మఫ్టీ కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వారి ఎదురుగానే తానెంతో ధీమాగా తిరగ్గలుగుతున్నానని, పోలీసులను వెర్రివాళ్లను చేయగలిగానని సాగర్ నవ్వుకున్నాడట.
మరోపక్క రంజిత్ రెడ్డి తీసుకువచ్చిన రూ.45 లక్షల్లో కొన్ని దొంగనోట్లు ఉండొచ్చని తన షాపు వద్ద నిల్చున్న కొందరి మాటలతో సాగర్‌కు అనుమానం కలిగింది. దీంతో మళ్లీ రంజిత్‌కు ఫోన్ చేసి ఆ నోట్లు తనకు స్కైప్ వీడియో కాల్ ద్వారా చూపించాలని చెప్పాడు. ఆ స్కైప్ కాల్ ద్వారా సాగర్ పోలీసులకు చిక్కాడు. స్కైప్‌లో అతడి ఫోన్ నెంబర్ డిస్ ప్లే కావడంతో పోలీసులు టెక్నాలజీ సాయంతో పరిశోధించి ఇదంతా చేసింది మెకానిక్ మంద సాగరేనని గుర్తించి అతణ్ని అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడు సాగర్ ఇద్దరు బావలు పోలీసుశాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వారికంటే ఎక్కువ సంపాదిస్తానని చాలెంజ్‌లు చేస్తూ, తన మాట నిలబెట్టుకోవడం కోసం చివరికి కిడ్నాప్‌కు పాల్పడి చిన్నారిని చంపేశాడు. ఏడాది కిందట కూడా ఓ ఇజ్రాయెలీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని దాని సాయంతో ఓ యువతిని వేధించాడు. ఇంటర్నెట్ వాయిస్ ఓవర్ ప్రోటోకాల్‌తో ఎవరికీ దొరక్కుండా కాల్స్ చేయవచ్చని సాగర్‌కు ఓ స్నేహితుడు చెప్పాడు. ఇంటర్ మాత్రమే చదివిన అతను టెక్నాలజీని పట్టుకుని క్రిమినల్ అవతారమెత్తాడు. సాగర్ ఇంతకుముందు పోలీసు వాహనానికి డ్రైవర్‌గా పనిచేసి రెండేళ్లుగా సొంత మెకానిక్ షాపు నడుపుకుంటున్నట్టు సమాచారం.