అమెరికాలోనూ ‘శ్రీరెడ్డి’ నగ్ననిరసన - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలోనూ ‘శ్రీరెడ్డి’ నగ్ననిరసన

April 9, 2018

సినీపరిశ్రమలో అమ్మాయిలపై సాగుతున్న అన్యాయం, లైంగిక దోపిడీ, క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాలపై అర్ధనగ్నంగా నిరసన తెలిపిన తెలుగు నటి శ్రీరెడ్డి ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అమ్మాయిలపై అన్యాయాలు టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్, హాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్.. అన్ని వుడ్‌లలో సాగుతున్నాయి. బాధితులు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నారు. తాజాగా అమెరికాలోని కోర్టు వద్ద ఒక మహిళ.. శ్రీరెడ్డిలాగే అర్ధనగ్న నిరసన తెలిపింది. అది కూడా కోర్టు వద్దే.

50 మంది అమ్మాయిలపై లైంగిక దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్న హాలీవుడ్ కమెడియన్ బిల్ కాస్బీ ఓ రేప్ కేసు విచారణ కోసం ఫిలడెల్ఫియాలోని మాంట్‌గోమరి కౌంటీ కోర్టుకు వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ టాప్‌లెస్‌గా వచ్చి నినాదాలు చేసింది. శరీరంపై ‘కాస్బీ రేపిస్ట్, ఉమెన్స్ లైవ్స్ మ్యాటర్, సెమెన్..’ అని రాసుకుంది. కాస్బీ ముందుకు వెళ్లడానికి బారికేడ్ దూకేసింది.

ఆమెను చూసి నిందితుడు 80 ఏళ్ల బిల్ కాస్బీ నవ్వుతూ వెళ్లాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆమె పేరు, ఇతర వివరాలు తెలియడం లేదు. అయితే ఆమెకూ కాస్బీ బాధితురాళ్లలో ఒకరని వార్తలు వస్తున్నాయి. కాస్బీ.. అమ్మాయిలకు అవకాశం ఇస్తానని చెప్పి లైంగికంగా వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో దోషిగా తేలాడు. కొన్ని కేసుల్లో పునర్విచారణ జరుగుతోంది. కాస్బీ.. కొంతమంది బాలికలపైనా అఘాయిత్యాలకు పాల్పడినట్లు కేసులు ఉన్నాయి.