ఎటువంటి సమయంలోనైనా భారతదేశం ఎదగగలదు అన్నారు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్. భవిష్యత్తు మీద ఇండియా ఆశను కలిగిస్తోందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా భారత్ పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించిందని చెప్పారు. వ్యవసాయం, వాతావరణ మార్పుల్లో శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు సాధిస్తున్న ప్రగతిని పరిశీలించేందుకు అక్కడకు వస్తున్నాని ఆయన తన బ్లాగ్ గెట్స్ నోట్స్ లో తెలిపారు. ఈ వ్యాఖ్యలను ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్ లో షేర్ చేసింది.
ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారత్. అయితే అంత జనాభా ఉన్నప్పటికీ పెద్దపెద్ద సవాళ్ళను ఎదుర్కొంటోంది, అందులో నుంచి బయటపడుతుందని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. పోలియో, హెచ్ఐవీ నిర్మూలన, పేదరికం, శిశుమరణాల సంఖ్య తగ్గించింది. ఆర్ధిక సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది….భారత్ పురోగతి సాధించింది అనడానికి ఇంతకు మించి సాక్ష్యాలు లేవని ఆయన అన్నారు. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తు మీద ఆశ కలుగుతోందని బిల్ గేట్స్ అభిప్రాయ్ వ్యక్తం చేశారు.
చాలా దేశాల్లాగే భారత్ పరిమిత వనరులను కలిగి ఉంది. అయినప్పటికీ ఎలా అభివృద్ధి చెందగలదో చేసి నిరూపించింది. సరికొత్త విధానాలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పరస్పర సహకారంతో పరిమిత వనరులతోనే అభివృద్ధికి బాటలు వేయొచ్చని ఆ దేశం ప్రపంచానికి చూపించిందని పొగిడారు బిల్ గేట్స్. ఇదే స్పిరిట్ తో ప్రపంచం అంతా కలిసి పనిచేస్తే వాతావరణ మార్పులతో పారాడగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత వ్యవసాయ సంస్థ శాస్త్రవేత్తలు 10 శాతానికి పైగా ఎక్కువ దిగుబడి, తీవ్ర కరువు తట్టుకోగల శనగల రకాలను ఉత్పత్తి చేసారని చెప్పారు బిల్ గేట్స్. ఇక్కడ పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం, సీజీఐఏఆర్ సంస్థలతో గేట్స్ ఫౌండేషన్ చేతులను కలిపిందని తెలిపారు. వాటిని చూసేందుకే తాను ఇండియా వస్తున్నానని అన్నారు.