మాజీ భార్యనే పెళ్లాడతానంటున్న బిల్‌గేట్స్ - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ భార్యనే పెళ్లాడతానంటున్న బిల్‌గేట్స్

May 2, 2022

అవకాశం వస్తే మళ్లీ తన మాజీ భార్యనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ . ఇటీవ‌ల గేట్స్.. తన భార్య మెలిడా ఫ్రెంచ్ గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే గేట్స్ ఫౌండేష‌న్ కోసం మాత్రం వీరిద్ద‌రూ క‌లిసి ప‌నిచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మే 1 న సండే టైమ్స్ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బిల్ గేట్స్ కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిపారు. అవ‌స‌ర‌మైతే తాను మ‌ళ్లీ మెలిండాను పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మే అన్న సంకేతాలు ఇచ్చారు. మెలిండాతో వైవాహిక బంధం అద్భుతంగా సాగింద‌ని, ఒక‌వేళ మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వ‌స్తే, మెలిండాను చేసుకోవ‌డంలో స‌మ‌స్య లేద‌న్నారు. గత రెండేళ్లలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని, కోవిడ్-19, విడాకులతో పాటు తన జీవితంలో భాగమైన పిల్లలను కూడా విడిచిపెట్టడం బాధాకరమని అన్నారు. ఇదే సమయంలో తన మాజీ భార్యతో ఫౌండేషన్ కోసం కలిసి పనిచేస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

త‌న మాజీ భార్య‌తో ఇంకా స్నేహం కొన‌సాగిస్తున్న‌ట్లు చెప్పారు. త‌మ మ‌ధ్య సంక్లిష్ట‌మైన స‌న్నిహిత రిలేష‌న్ ఉంద‌న్నారు. ఇద్ద‌రం క‌లిసి ఫౌండేష‌న్ స్టార్ట్ చేశామ‌ని, ఇద్ద‌రం క‌లిసి ప‌నిచేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఎందుకు విడిపోయారని అన్న ప్రశ్నకు ఆయన సింపుల్‌గా సమాధానం చెబుతూ… వివాహాలు చాలా సంక్లిష్ట‌మైన‌వ‌ని, వాటి గురించి లోతుగా చ‌ర్చించ‌డం స‌రికాదు అని, కానీ విడాకుల నుంచి ఇద్ద‌రూ కోలుకుంటున్న‌ట్లు బిల్ గేట్స్ తెలిపారు. 2021 మే నెల‌లో బిల్‌, మెలిండాలు విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 2021 ఆగ‌స్టులో వారికి డైవ‌ర్స్ క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. వీరికి జెన్నిఫ‌ర్‌, రోరీ, ఫోబో అనే ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు.