మనం ఏదైనా జాబ్ కావాలంటే ముందుగా అడిగేది రెజ్యూమ్ని. అందులో విద్యార్హతలు, ఆసక్తులు, నైపుణ్యాలు, జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు? వంటి వివరాలతో తమ ప్రొఫైల్ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతారు. మనమే ఇలా చేస్తే మరి ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఎలా తయారు చేస్తాడు? ఏంటీ? ఆయనకు రెజ్యూమ్ తోటి ఏం పని? ఆయన కిందే వేలాది మంది పని చేస్తారు కదా అనే అనుమానం వచ్చిందా? అయితే ఇది ఇప్పటిది కాదు. సుమారు 48 ఏళ్ల క్రితంది. ఆయన కంపెనీ పెట్టకముందు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా, ఆ సమయంలో తయారు చేసుకున్న రెజ్యూమెను తాజాగా లింక్డ్ ఇన్లో షేర్ చేశారు. అందులో ఆయన పేరు విలియం హెచ్ గేట్స్గా ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీలో తొలి ఏడాది చదువుతున్నట్టు, ఆపరేటింగ్ స్ట్రక్చర్స్, డేటాబేస్ మేనేజ్మెంట్, కంపైలర్ కన్స్ట్రక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటివి నేర్చుకున్నట్టు అందులో పేర్కొన్నారు. వీటితో పాటు ఫోట్రాన్, కోబోల్, బేసిక్ వంటి వాటిపై అనుభవం ఉందని రాసుకున్నాడు. కాగా, ఈ రెజ్యూమె నెట్టింట్లో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు.. రెజ్యూమ్ 48 ఏళ్ల కింద తయారు చేసినప్పటికీ ఎంతో ఉత్తమమైనదిగా కనిపిస్తోందని ప్రశింసిస్తున్నారు.