ఎంపీల జీతాల్లో 30 శాతం కోత..  - MicTv.in - Telugu News
mictv telugu

ఎంపీల జీతాల్లో 30 శాతం కోత.. 

September 15, 2020

కరోనా వైరస్ ప్రభావం సామాన్య ప్రజల మీదే కాదు చివరికి ఎంపీల మీద కూడా పడింది. వారి జీతాల్లో 30 శాతం కోత పడింది. ఈ మేరకు పార్లమెంట్‌ సభ్యుల వేతనంలో 30 శాతం కోత విధించే బిల్లును లోక్‌సభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. కరోనాతో తలెత్తిన అవసరాలను తీర్చేందుకు ఎంపీల వేతనాల్లో కోత విధిస్తూ పార్లమెంట్‌ సభ్యుల వేతనాలు, పెన్షన్‌ బిల్లు 2020ను లోక్‌సభ ఆమోదించింది. మరోవైపు నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణలపై లోక్‌సభ చర్చిస్తోంది. బిల్లు సవరణలకు సభ ఆమోదం పొందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే డీజీసీఏ, ఏఏఐబీ, బీసీఏఎస్‌లకు చట్టపరమైన అధికారాలను కల్పించే ఎయిర్‌క్రాఫ్ట్‌ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ విషయమై పౌర విమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి హర్షం వ్యక్తంచేశారు. ఈ బిల్లు ఆమోదంతో భారత పౌర విమానయాన రంగంలో భద్రత మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన వెల్లడించారు. 

ఇక సరిహద్దు వివాదంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సభలో మాట్లాడారు. ‘సరిహద్దు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత చల్లారలేదు. చైనాతో సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నా సరిహద్దులను గుర్తించేందుకు చైనా నిరాకరిస్తోంది. చైనా మొండిగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించింది. చైనా దూకుడుకు చెక్‌ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయి’ అని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు.