అయ్యప్పను చూస్తాం, రక్షణ కల్పించండి.. సుప్రీంకు బిందు - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్పను చూస్తాం, రక్షణ కల్పించండి.. సుప్రీంకు బిందు

December 2, 2019

supreme court, 02

మహిళా హక్కుల కార్యకర్త బిందు అమ్మిని వెనక్కి తగ్గడం లేదు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రత కల్పించాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాను ఇటీవల శబమరిమలకు వెళ్తుండగా కొందరు అడ్డుకున్నారని, పోలీసులు తనకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు 2018లో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

 సుప్రీం తీర్పును సవాలు చేస్తూ పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని నవంబర్ నెలలో అత్యున్నత న్యాయస్థానం సమీక్షించి, ఏడుగురు సభ్యుల విస్మృత స్థాయి ధర్మాసనానికి విచారణను అప్పగించింది. సుప్రీంకోర్టు తన తీర్పులో మహిళల ప్రవేశంపై స్టే ఇవ్వలేదు. మరోపక్క శబరిమలకు వెళ్లే మహిళా భక్తులకు భద్రత కల్పించలేమంటూ కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఈ నేపథ్యంలో ఇటీవల కొంత మంది మహిళా భక్తులతో శబరిమల వెళ్లిన బిందుపై నవంబర్ 25న కొందరు ఎర్నాకులంలో కొందరు స్ప్రే, కారం పొడితో దాడి చేశారు. దీనికి సంబంధించిన కొంతమంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బిందు అమ్మిని కేర‌ళ‌లోని క‌న్నూరు వ‌ర్సిటీలో లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఆమె ఈ ఏడాది జనవరిలో శబరిమల ఆలయంలోకి ప్రవేశించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.