పవర్ స్టార్ అభిమానుల కోరిక మేరకు ఆయన జీవిత చరిత్రను డిగ్రీ పాఠ్యాంశంగా పొందుపరుస్తూ కన్నడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రత్న, పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ చనిపోయి 14 నెలలవుతున్నా అభిమానులు మాత్రం మరిచిపోవడం లేదు. శాండల్ వుడ్ రాజకుమారగా అందరి మదిలో ఉన్నారు. ఆయన అభిమాన సంఘాలు కలిసి ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాశాయి. దీంతో బెంగళూరు విశ్వవిద్యాలయం తన డిగ్రీ బీకామ్ మూడవ సెమిస్టర్ లో పునీత్ జీవితం నుంచి సారాంశాన్ని తీసుకొని పాఠ్యాంశంగా రూపొందించింది. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు పునీత్ జీవితం ఆధారంగా డాక్టర్ మునియప్ప రాసిన జీవిత చరిత్ర నేనే రాజకుమార పుస్తకాన్ని పునీత్ భార్య అశ్విని పునీత్ రాజ్ కుమార్ కొద్దిరోజుల క్రితం నాలుగవ ఎడిషన్ ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం కర్ణాటకలో కన్నడ భాషలో అత్యధికంగా అమ్ముడైన జీవిత చరిత్రగా రికార్డు సాధించింది. ఈ పుస్తకం అమ్ముడుపోయినన్ని కాపీలు మరే పుస్తకం అమ్ముడుపోలేదు.