ఏపీలో ఏప్రిల్ 1 నుంచి బయోమెట్రిక్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి బయోమెట్రిక్

March 19, 2022

bb

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా శనివారం ఈ విధానానికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా, భోధన, ప్రాంతీయ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానం ఉంటుందని తెలిపింది. బయోమెట్రిక్ హాజరు అమలు కోసం ఆస్పత్రుల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశామని పేర్కొంది.

అంతేకాకుండా డ్యూటీకి హాజరై, పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తే.. సెలవుల్లో కోత ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డాక్టర్లతో పాటు సిబ్బంది డ్యూటీ సమయంలో ఆస్పత్రిలో ఉండకుండా సొంత పనులపై బయట తిరుగుతున్నారని.. ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈ అంశంపై దృష్టిపెట్టామని.. అందుకే బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అటు వైద్య సిబ్బంది తాము ఆస్పత్రిలోనే ఉన్నామని గంట గంటకు సెల్ఫీ సంబంధిత వెబ్‌సైట్‌లో ఫోటోలు అప్‌లోడ్ చేయాలని ఆరోగ్య శాఖ కమిషనర్ కంఠమనేని భాస్కర్ ఆదేశించారు. దీంతో వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.