వెండితెరపై క్రికెటర్ల బయోపిక్ రావడం కొత్తేమీ కాదు. గతంలో ధోనీ, మిథాలీ రాజ్ జీవిత చరిత్రలు సినిమాలుగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర సినిమాగా రానుంది. దాదా పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో, చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ నటించనున్నారు. ఈ విషయాన్ని గంగూలీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఓ వ్యక్తి చెప్పాడని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గతంలోనూ బయోపిక్ తెరకెక్కించాలనుకొని ప్రయత్నాలు చేసినప్పటికీ రణబీర్ డేట్స్ దొరకలేదు. దీంతో హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా పేర్లు పరిశీలను వచ్చాయి.
ఇంతలో రణబీర్ కపూర్ డేట్స్ అడ్జెస్ట్ చేయడంతో డీల్ ఓకే అయ్యిందని సమాచారం. దీంతో పాటు చిత్ర దర్శకుడితో రణబీర్ కపూర్ త్వరలో కోల్‌కతా వెళ్లనున్నారని తెలుస్తోంది. గంగూలీ గురించి లోతుగా తెలుసుకునేందుకే ఈ టూర్ అని సదరు సన్నిహిత వ్యక్తి రివీల్ చేశాడంట. ఈ పర్యటనలో క్యాబ్ ఆఫీస్, ఈడెన్ గార్డెన్ గ్రౌండ్, గంగూలీ ఇల్లు, ఇంటి పరిసరాలను సందర్శించనున్నారు. కాగా, రణబీర్ ప్రస్తుతం తూ ఝూటీ మై మక్కర్ చిత్రంలో నటిస్తున్నాడు. అటు గంగూలీ ఏ పదవిలోనూ లేని విషయం తెలిసిందే.