‘ఆ రెస్టారెంట్‌లో బిర్యానీ తింటే మగాళ్లకి..’ షాప్‌ని మూయించిన టీఎంసీ లీడర్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆ రెస్టారెంట్‌లో బిర్యానీ తింటే మగాళ్లకి..’ షాప్‌ని మూయించిన టీఎంసీ లీడర్

October 24, 2022

ఓ వింత కారణం చెప్పి బిర్యానీ షాపుని మూసేయించారు బంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ లీడర్‌. కూచ్బిహార్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ అయిన రవీంద్రనాథ్ ఘోష్… బిర్యానీలో ఉపయోగిస్తున్న మసాలాల కారణంగా పురుషుల్లో లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందంటూ షాప్ను సీజ్ చేయించారు. బిర్యానీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వల్ల పురుషుల్లో శృంగార కోరికలు తగ్గుతున్నాయని ఘోష్ పేర్కొన్నారు. తన వాదన సరి అనేందుకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. షాపుని అధికారులతో బలవంతంగా మాయించారు. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది.

“కూచ్బిహార్ మున్సిపల్ పరిధిలో అనేక దుకాణాలు అక్రమంగా నడుస్తున్నాయని మాకు సమాచారం అందింది. అలాంటి దుకాణాల్లో ఒకటైన కోల్కతా బిర్యానీ షాప్పై ఓ ఆరోపణ వచ్చింది. ఆ దుకాణం వారు ఉపయోగిస్తున్న కొన్ని పదార్థాల కారణంగా పురుషుల్లో లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందని వేర్వేరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయి. అందుకే వచ్చి ఈ దుకాణాన్ని మూసేశాం” అని చెప్పారు ఘోష్.

ఇదే తరహాలో మరికొన్ని దుకాణాల్ని మూసేస్తామని సంకేతాలిచ్చారు. “ఈ ఒక్క దుకాణమే కాదు.. మరెన్నో షాప్లను రోడ్డును ఆక్రమించి నడుపుతున్నారు. రోడ్లపైనే వంట చేస్తున్నారు. అసలు వీరంతా ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు. బిహార్, ఉత్తర్ప్రదేశ్ వాళ్లు కావచ్చు. అర్ధరాత్రి వరకు ఈ షాప్లు తెరిచే ఉంచుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు. కొందరు తాగి, ఇక్కడ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు. వీరెవరికీ లైసెన్సులు లేవు. వీరి గురించి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. అందుకే వీరు ఎవరు, ఎక్కడ నుంచి వచ్చారో తెలుసుకోమని పోలీసులను కోరాం” అని చెప్పారు ఘోష్.