రోజాకు చేదు అనుభవం.. సెల్‌ఫోన్ చోరీ - MicTv.in - Telugu News
mictv telugu

రోజాకు చేదు అనుభవం.. సెల్‌ఫోన్ చోరీ

April 21, 2022

 

ఆంధ్రప్రదేశ్ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజాకు తిరుమ‌ల‌లో గురువారం వింత అనుభ‌వం ఎదురైంది. తిరుమ‌ల‌లో ఉన్న క‌లియుగ దైవమైన శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామివారిని ఆమె ద‌ర్శించుకున్నారు. అనంతరం తిరుప‌తిలో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకొని, ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోజాను స‌న్మానించేందుకు పోటీ ప‌డ్డారు. ఇదే అద‌నుగా ఓ వ్య‌క్తి రోజా మొబైల్ ఫోన్‌ను కొట్టేశాడు. త‌న సెల్ ఫోన్ క‌నిపించ‌క‌పోయేస‌రికి రోజా ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

దీంతో తన పక్కనే ఉన్న పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై అక్క‌డి సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించారు. అందులో రోజా మొబైల్‌ను చోరీ చేసిన వ్య‌క్తిని గుర్తించారు. చోరీకి పాల్పడ్డిన వ్య‌క్తి,.. ఫోన్‌తో కారు ఎక్కేసి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. కారు నెంబ‌రు ఆధారంగా పోలీసులు అత‌డి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఈ నేపథ్యంలో ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్‌లో రోజా సెల్ ఫోన్‌ను కొట్టేసిన స‌ద‌రు వ్య‌క్తి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎస్వీ యూనివ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోకి వెళ్లిన‌ట్టుగా గుర్తించారు. అక్క‌డికి పోలీసులు చేరుకొని ఎట్ట‌కేల‌కు దొంగ‌ను ప‌ట్టుకున్నారు. అత‌డి నుంచి రోజా సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచార‌ణ‌లో అత‌డు కాంట్రాక్టు ఉద్యోగిగా తెలినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన మంత్రి ఫోన్ దొర‌క‌డంతో దానిని జాగ్ర‌త్త‌గా తీసుకుని వ‌చ్చి రోజాకు అప్ప‌గించారు. దీంతో ఆమో ఊపీరిపిల్చుకున్నారు.