మేత కోసం పొలాలకి వెళ్లిన గేదె.. తప్పిపోయి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆ బాలిక మనస్తాపానికి గురైంది. గేదె కనిపించకుండా పోవడంతో ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లా కురోనా గ్రామంలో చోటుచేసుకుంది. ఆ గ్రామంలో బైని కేవత్ అని వ్యక్తి కుటుంబం గేదెలను పెంచుకుంటూ, అవి ఇచ్చే పాలను అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నది. అతని కూతురు రజనీ.. ఆ ఇంట్లో ఉండే మూడు గేదెలు బాగోగులు చూసుకునేది. ఈ క్రమంలో బాలికకు గేదెలతో అనుబంధం ఏర్పడింది.
ఈ నెల ప్రారంభంలో గేదెలు మేయడానికి బయటకు వెళ్లిన గేదెల్లో రెండు ఆ సాయంత్రమే తిరిగి రాగా, మరొకటి రాలేదు. తప్పిపోయిన గేదెను కనిపెట్టడానికి తమ కుటుంబసభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారని బైని తెలిపారు. పోలీసుల సహాయం కూడా కోరామని, కానీ తప్పిపోయిన గేదె జాడ దొరకలేదన్నారు. దీంతో తన కుమార్తె రజనీ తీవ్రంగా చెందిందని, ఎవ్వరితోనూ మాట్లాడటం మానేసిందని చెప్పారు. తన కూతురు బాధలో ఉందనుకున్నామే కానీ ఈ విపరీతమైన చర్యకు పాల్పడతుందని గ్రహించలేదని అతడు బావురమన్నాడు. గత వారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రజనీ ఉరి వేసుకున్నదని, వెంటనే అప్రమత్తమై ఝాన్సీలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు.