రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తన అభ్యర్ధులను ప్రకటించింది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ స్థానానికి వెంకట్ నారాయణ రెడ్డిని ఖరారు చేసింది. ఏపీలో ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల స్థానానికి నగరూరు రాఘవేంద్ర, శ్రీకాకుళం-విజయనగరం- విశాఖపట్టణానికి పీవీఎన్ మాధవ్ పేర్లను ప్రకటించింది.
మిగిలిన ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ఇంకా ప్రకటించలేదు. కాగా, ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 ఉపాధ్యాయ, 9 స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, తెలంగాణలో ఒక ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 27 వరకు నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 13న పోలింగ్, మార్చి 16న ఫలితాలు వెల్లడిస్తారు. అటు ఈ ఎన్నికలతో ఆయా నియోజకవర్గాలు, జిల్లాలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్న తరుణంలో జాతీయ పార్టీ అయిన బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపి ఓట్లు రాబడుతుందో చూడాల్సి ఉంది.