మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తిరుగుబాటు నేత షిండే ఇప్పటికే ప్రకటించగా, రెబెల్ ఎమ్మెల్యేలంతా అసోం రాజధాని గౌహతిలో ఆశ్రయం పొందడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా వాటిపై స్పందించిన అసోం బీజేపీ సీఎం బిశ్వ శర్మ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు బీజేపీ పార్టీ మద్దతుందని తేల్చి చెప్పారు. అయితే అందులో తాను మాత్రం ఎలాంటి జోక్యం చేసుకోననీ, అతిథులుగా వచ్చిన వారిని మంచిగా చూసుకోవడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. దీంతో బీజేపీ మద్దతు అధికారికంగా, బహిరంగంగా వెల్లడించినట్టైంది. కాగా, రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్ధమవుతోంది. సుమారు 16 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్టు డిప్యూటీ స్పీకర్ తెలిపారు.