BJP believes in November sentiment for munugode by election result
mictv telugu

నవంబర్ సెంటిమెంటును నమ్ముకున్న బీజేపీ.. మునుగోడుపై ధీమా!

November 3, 2022

BJP believes in November sentiment for munugode by election result

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ముగిసింది. రెండు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా చివరి వరకు పోరాడాయి. విజయం తమదంటే తమదని ఇరు పార్టీలు ధీమాగా ఉన్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి తమను గెలిపిస్తాయని గులాబీ నేతలు అంటుంటే, బీజేపీ మాత్రం సెంటిమెంటుని నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు రెండు ఉదాహరణలను ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. మొదటిది దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల విజయాలు, అవి సాధించిన నెలను ప్రత్యేకంగా చెప్పుకొస్తున్నారు.

2020లో దుబ్బాక ఉప ఎన్నికలో ఆ పార్టీ నేత రఘునందన్ రావు విజయం సాధంచిన విషయం తెలిసిందే. 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈ రెండు విజయాలు తమకు నవంబర్ నెలలోనే దక్కాయని, ఫలితాల విడుదల ఈ నెలలోనే జరిగింది కాబట్టి మునుగోడులో కూడా తమదే విజయమనే విశ్వాసంతో ఉన్నారు. దుబ్బాక ఫలితాలు నవంబర్ 10న రాగా, హుజూరాబాద్ ఫలితాలు నవంబర్ 2న వచ్చాయి. ఇప్పుడు మునుగోడు ఎన్నిక ఫలితాలు నవంబర్ 6న రాబోతున్నాయి. తమకు ఈ సెంటిమెంట్ కలిసివస్తుందని కమల నాథులు నమ్మకంతో ఉన్నారు.

ఇక మరో సెంటిమెంట్ అక్షరంతో ముడిపడి ఉంది. తెలంగాణలో బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు ఆర్ అనే అక్షరంతో మొదలవుతున్నాయి. రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్ ఇలా ముగ్గురిని ముద్దుగా ఆర్ఆర్ఆర్ అని పార్టీ అభిమానులు పిలుచుకుంటున్నారు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ కి మరో ఆర్ జత కాబోతుందని భావిస్తున్నారు. మునుగోడులో ఆ పార్టీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి పేరు ఆర్ తో ప్రారంభం కావడంతో ఫలితం తమకు అనుకూలంగా రాబోతుందని కచ్చితంగా చెప్తున్నారు. వీరి సెంటిమెంటు, అంచనాలు ఏ మేరకు కలిసి వస్తాయో చూడాలి మరి.