బీజేపీ కొత్త జాతీయ కార్యకవర్గంలో తెలుగు మహిళలకు పెద్దపీటలు - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ కొత్త జాతీయ కార్యకవర్గంలో తెలుగు మహిళలకు పెద్దపీటలు

September 26, 2020

BJP Chief JP Nadda Chooses Massive New Team

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు ఆ పార్టీ జాతీయ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి చోటు దక్కింది. వారిలో ఇద్దరు మహిళలు ఉండడం గమనార్హం. తెలంగాణకు చెందిన డీకే అరుణ, లక్ష్మణ్‌, ఆంధ్రప్రదేశ్ కి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్‌లకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులు కాగా పురందేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏపీకి చెందిన సత్యకుమార్‌ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగనున్నారు. జేపీ నడ్డా మొత్తం 12 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మందిని జాతీయ ప్రధాన కార్యదర్శులగా, ముగ్గురు జాయింట్‌ జనరల్‌ సెక్రటరీలను నియమించారు. 

అలాగే జాతీయ కార్యదర్శులుగా 13 మందికి అవకాశం ఇచ్చారు. జాతీయ అధికార ప్రతినిధులుగా 23 మందికి స్థానం కల్పించారు. వీటితో పాటు బీజేపీకి చెందిన ఇతర విభాగాలకు అధ్యక్షులను, ఇన్‌ఛార్జులను నియమించారు. బెంగళూరుకు చెందిన తేజస్వి సూర్య భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గతంలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న మురళీధర్‌ రావు, రాంమాధవ్‌, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్‌ నర్సింహారావు పేర్లను ప్రస్తుత జాబితా నుంచి తొలగించారు. ప్రస్తుతం పార్టీ పరంగా మార్పులు చేసిన బీజేపీ త్వరలో మంత్రివర్గంలోనూ మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ పదవులు దక్కని వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.