ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును ధైర్యంగా ఎదుర్కొంటానన్న ఎమ్మెల్సీ కవితలా ఆ విధంగానే ముందుకు వెళ్లాలని, తెలంగాణ ఆడపడచులందర్నీ ఈ కేసులోకి లాగకూడదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు అన్నారు. కవితకు ఈడీ నోటీసు, బీజేపీపై ఆమె విమర్శల నేపథ్యంలో ఆయన బుధవారం మెదక్ లో జరగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతోంటే మోదీ ఏం చేస్తున్నారు, చర్యలు తీసుకోవచ్చుగా కదా అని కొందరు అంటున్నారు. అలాంటి వారికి జవాబు కవితకు ఈడీ నోటీసులు. అడ్డదారిన ఎమ్మెల్సీ అయిన కవిత తను చేసిన తప్పును తెలంగాణ ఆడపడుచులకు రుద్దడం బాధాకరం. లిక్కర్ కుంభకోణంలో ఆదాయం పెంచుకోవడానికి ఎందుకు తలదూర్చారో గుర్తు తెచ్చుకోవాలి చెల్లె. ఆస్తుల కోసం ఢిల్లీ లో లిక్కర్ దందా నువ్వు చేసి ఈ రోజు అందరిని కలపడం పద్ధతి కాదు. కవితకు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు చేయడమేమటి? నోటీసులు ఇస్తే ఎదుర్కొంటా అంటివి గదా చెల్లే, ఇప్పుడు ఎదుర్కో’’ అని రఘునందన్ ఎద్దేవా చేశారు.
ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా కవితలాగే తప్పిచ్చుకుందామని ప్రయత్నించినా పప్పులు ఉడకలేదని, చట్టానికి ఎవరు చుట్టం కాదని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఢిల్లీలో చేయబోతున్న నిరాహార దీక్షపైనా ఆయన మండిపడ్డారు. ‘‘ఆమె ఎంపీగా ఉన్నప్పుడు ఆ బిల్లు పెట్టమని కొట్లాడిందా? తెలంగాణలో మహిళా జనాభాకు తగ్గట్టు మీరు మంత్రి పదవులు ఇచ్చారా? నువ్వు ఏనాడైనా అడిగినవా? దొంగే దొంగ అన్నట్లు ఉంది ఆమె దీక్ష’’ అని మండిపడ్డారు.