పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని ప్రధాని మోదీ వచ్చే ఎన్నికల్లో పాలమూరు నుంచి పోటీ చేయాలని ఏ ముఖం పెట్టి అడుగుతున్నారని మంత్రి కేటీఆర్ బీజేపీ నాయకులను నిలదీశారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు కార్యాలయాలు, అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన ప్రగతి నివేదన బహిరంగ సభలో మంత్రి ప్రసంగిస్తూ కేంద్రం విధానాలను ఎండగట్టారు. ‘పాలమూరు ప్రజలు ఎండాలి. కడుపు మండి ప్రభుత్వంపై తిరగబడాలని పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ముందుకు సాగనీయడం లేదు. ఏదేమైనా, ఎంత కష్టమైనా రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుంది. కృష్ణా జలాల్లో వాటాలు తేల్చని మోదీని దేవుడు అంటారా? బీజేపీ కార్యవర్గ సమావేశాలు పాలమూరులో జరుగుతున్నాయని తెలిసింది.
మీకు దమ్ముంటే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని తీర్మానం చేయగలరా’ అంటూ వాగ్బాణాలు సంధించారు. అంతేకాక, మోదీ ప్రభుత్వం రైతులపై ఆదాయపన్ను వేసే ఆలోచన చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ‘ప్రధాని మోదీ ఆర్ధిక సలహాదారు విబేక్ దేబ్రాయ్ ఆ పత్రికలో నిన్న ఓ వ్యాసం రాశారు. దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు అయిందని, డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఆదాయం భారీగా పెరిగింది కాబట్టి రైతులపై ఆదాయ పన్ను వేయాలని రాసుకొచ్చారు. ఆయనేమీ అల్లాటప్పా మనిషి కాదు. ప్రధానికి ఆర్ధిక సలహాదారుగా ఉన్న వ్యక్తి రాసిండు. ఇంత దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆదాయమే లేక ఏడుస్తుంటే పన్ను వేస్తాడంట. రైతులు ఒకసారి ఆలోచించుకోవాలి’ అని అభిప్రాయపడ్డారు.