BJP is conspiring to hit YCP: KCR
mictv telugu

వైసీపీని దెబ్బతీసేందుకు కుట్ర.. కేసీఆర్ నోట జగన్ ప్రస్తావన

November 15, 2022

ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం మాత్రమే ఉందని సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. మంగళవారం జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్నికలు, అభివృద్ధి, బీజేపీ, వైసీపీ, జగన్ వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. రాజకీయంగా దాడి చేస్తున్న బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలని ఈ సందర్భంగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే సమావేశంలో ఆయన వైసీపీ, వైఎస్ జగన్‌ల గురించి మాట్లాడారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ, సీఎం జగన్ బీజేపీకి అనుకూలంగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఓ వైపు తమకు జగన్ అనుకూలంగా ఉన్నా.. ఆయన పార్టీని బలహీనం చేసే కుట్రకు బీజేపీ దిగిందని, ఇంతకన్నా ఘోరం మరొకటుందా? అని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా ఏకంగా తన కుమార్తె కవితను పార్టీ మారాలంటూ ఆ పార్టీ నేతలు అడిగారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చెప్పినట్టు సిట్టింగులకే సీట్లు ఇస్తానని, పది నెలల పాటు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈడీ, సీబీఐ దాడులు జరుగుతాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉంటూ వివాదాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.