బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదు.. అన్నీ వర్గాలూ సమానమే - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదు.. అన్నీ వర్గాలూ సమానమే

March 15, 2020

BJP is not against any religion .. All communities are equal… Bandi Sanjay

భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదని, అన్ని వర్గాలను సమాన భావంతో చూస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కుమార్‌ ఈరోజు(ఆదివారం) బాధ్యతలు స్వీకరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఇతర నేతలు ఘనంగా స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సామాన్య కార్యకర్తగా పనిచేసిన నేను ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి బీజేపీ నన్ను గౌరవించింది. సిద్ధాంతాలను నమ్ముకుని ముందుకు వెళ్తున్న నన్ను నమ్మి బాధ్యతలు అప్పగించారు. 

రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తాను. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. అన్నీ వర్గాలను సమానంగా చూస్తుంది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయే. ఎందరో యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ రాజ్యం ఏలుతున్నారు. ఎంఐఎంతో కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక నియంతలా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలోకి రావాల్సిందే. కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాల్సిందే. కేటీఆర్‌ని సీఎం చేయడం కోసం యాగాలు చేయడం హిందూ ధర్మం కాదు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం ఇచ్చే నిధులు కేసీఆర్ సొత్తు కాదు. కేంద్రం ఇచ్చే నిధులను తాము ఇస్తున్నట్లు రాష్ట్రం ప్రచారం చేసుకోవడం అత్యంత దారుణం. రాష్ట్రంలో బతుకుతెరువు కోసం యువకులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు, ఇంటర్‌ విద్యార్థుల సమస్యలపై సీఎం కేసీఆర్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు. మా పార్టీ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేస్తుంది.. ప్రజల కోసమే త్యాగం చేస్తుంది’ అని బండి సంజయ్‌ అన్నారు.